ఈ పుట ఆమోదించబడ్డది

పదమూడవ ప్రకరణము


లందు దీపములు వెలిగించుటతోడనే వాని కాంతులును పూలమొక్కల కాంతులును నేకమై వీధియంతయు శోభాయమానమై లక్ష్మీవిలాసస్థానమో యన రాజిల్లుచుండును. రాజుగారి దివాణము నందేగాక నగరమం దెక్కడ జూచినను చెవులు గింగురుమన శుభవాద్యములు మ్రోగుచుండెను. తక్కిన వీధులును గొంచె మించుమించుగ నిటులే యలంకృతములై యుండెను. జయచంద్రుడు సమస్త దేశాధిపతులకు శుభలేఖల సంపెగాని తన పూర్వ వైరము తలచి డిల్లీపతికి మాత్రము వర్తమాన మంపక తిరస్కారభావమున నుండెను. ఆటులుండుటయేకాక చక్రవర్తిని మఱింతయవమాన పఱచుటకై రాతివిగ్రహము నొకదానిఁ జేయించి దానికి ఢిల్లీపతినామమిడి కోట బహిర్ద్వారమునఁ బెట్టించి లోపలికి వచ్చు వారందఱా విగ్రహముపై నుమిసి రావలయునని యాజ్ఞాపించెను. ఈ వార్తవిని నగరమంతయు నల్లకల్లోలము కాసాగెను. కొందఱు జయచంద్రున కిదియేమి వెఱ్ఱి? ఇట్లుచేయుట తగునా యనువారును, కొందఱు వీనికిఁ బోవుకాలము సమీపించినది కావుననే యిట్టిబుద్ధి పుట్టినదను వారును, కొందఱు మనకిక రణము దప్పదనువారునునై జనులెల్లరు వీధులందు గుంపులు గుంపులుగ గూడి మాటలాడుకొన జొచ్చిరి. దుర్మార్గులగువారు మాత్ర మతని మఱింత ప్రోత్సాహము చేయుచుండిరి. నృపుఁడును దక్కుంగల కార్యముల సన్నాహము జేయించుచుండెను.

99