ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


సైన్యము ఠీవిమై చనుదెంచుచుండెను. ఈ సేనానంతర మాజానేయము లెనిమిదింటిచే బంధింపబడిన రాజుగారిబగ్గివచ్చు చుండెను. ప్రతియశ్వముపై నొక్కొక్కభటుఁడు గూరుచుండి తోలుచుండెను. అందు దనప్రధానమంత్రితో గన్యాకుబ్జనగర వైభవమును గూర్చి ముచ్చటించుకొనుచు కాశ్మీర మహారాజుగా రాసీనులై యుండిరి. వీరి యనంతరము పదిమంత్రులు, రాజ్యమందలి ముఖ్యాధికారులు మొదలగువారు కూరుచున్న బగ్గీలు వరుసలుతీరి వచ్చుచుండెను. వీటికన్నిఁటికిఁ జివర మఱియొక సేనానియు మరికొంతసేనయు బాహ్లీకములపై వచ్చుచుండెను. ఈ సందడతగ్గువరకు పైనబేర్కొన్న బ్రాహ్మణుఁడు తానున్న చోటనేయుండి యదితగ్గిపోయిన తోడనే మరల బయలుదేరి నడచుచుఁ గొంతదూర మేగిన పిదప దనకొఱకై నలుదిక్కులఁ బరికించుచు నిలువంబడియున్న తనవారలఁ గలుసుకొని "నాయనలారా నా యదృష్టమున నేడు మిమ్ము గాంచగల్గితిని. ఇక్కడ నీ బగ్గీలక్రిందఁబడి చచ్చుటకంటె మన గ్రామములందు మ్లేచ్చులుపోయు వేడినూనియలచేత జచ్చుటే మేలని తోచుచున్నది. మనకిక నెట్లును బ్రతుకుతెరువులేదు. అతనికేమి? ఏ చింతలులేక పౌరుల మొరలాలకింపక జయచంద్రుడు హాయిగ బెండ్లి గావించుకొనుచున్నాడు. ఇట్టిరాజు బ్రతికిననేమి? చచ్చిన నేమి? మనమీ రాజ్యము వదలిపోయిన బ్రతుకుదుమేమో కాని యిక్కడేయున్నటులైన వట్టిదే. మీకేమైన రాజుగారి దర్శనము లభించినదా?

96