ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రకరణము


యత్యుత్సాహమున నెరవేర్చి గెలుపుఁ గొందురనురీతి, దుమ్మెగిరిపోవునట్లు గాలివీచుచున్న సమయమందే చినుకులును నారంభమై గాలి యడగినతోడనే వర్షమెక్కువగా సాగెను. క్రమక్రమముగ వృద్దియై సంవర్తకాల ఘనాఘనముల చందంబున వాఁగులు వాఱఁ గురియఁగడఁగెను. మేఘుఁడు దారాప్రవాహ పూర్వకంబుగఁ గాళిందీకన్యకకు మౌక్తికముల సమర్పించు చున్నాడో యనఁ బలువిధములగు మల్లెలు జాజులతోడం గూడిన లతా వితతులు వాఁగులవెంటఁ గొట్టుకొనిపోయి యమునయందుఁ జేరుచుండెను, ఆర్యావర్తమునకిఁక ముందురాఁబోవు దుర్దశలం దలంచి పంచమహా భూతంబులు జాలింబడి కాలువలుగట్ట విలపించుచున్నవియోయన ధారలత్యంతములై జోరున వర్షము కురియుచుండెను.

అట్లు గడియలకొలఁది నాకసము చిల్లిపడినట్లుఁ, గడవలతోఁ గ్రుమ్మరించినగతి వానకురియుచుండ హాలారసపానమత్తులై శరీరము లెఱుఁగక పడియున్న పైసిపాయిలును, బండ్లవారలును సగము తడిసినపిదపఁ గలిగిన చలివలనఁ దెలివినొంది నలుదిక్కులఁ బరికించు నప్పటికి దిశలగుపడని యంత దట్టముగ వర్షము కురియుచుండెను. అందుల కాశ్చర్యమగ్ను లై బండ్లనొక మహావృక్షముక్రింద నాపి యందఱును వాటి యడుగుభాగమునకుఁ జేరిరి. అనంతర మించుకసేపున కావర్ష సంరంభమడఁగి జల్లుపడుచుండ బయటికేతెంచి చూచి తాము దారితప్పి వేరొకచోట నుండుటఁ దెలిసికొనిరి. అందుల

9