ఈ పుట ఆమోదించబడ్డది

పదియవ ప్రకరణము


గుడిజేరి తలుపులుదగ్గరకు వేసియుండుట గాంచి యించుక దెఱచుకొని వీక్షింతుగదా! ఏమనివచింతు “నా పంచప్రాణములు పైవి పైకెగిరిపోయెను. ప్రకాశమైన యగండము వెలుగున నీవు ధరించియున్న వస్త్రమును గుర్తించితిని. గుర్తించినవెంటనే గుబాలున దలుపులనెట్టుకొని వేరొండాలోచింపక నిన్ను జంప గత్తినెత్తియున్న వానిచేతి సట్లే నఱికితిని. తరువాత జరిగిన సంగతులు నీకును విశదమేగదా” యని వచించిన వెంటనే పులకీకృతాంగయై సంయుక్త తన చెలిల గౌగిలించుకొని " హా ! నా ప్రాణపదమా ! మృత్యువునోట బడనున్న నన్ను రక్షించిన మహానుభావుండవు నీవేనా ? నీయా ఋణము నే నెట్లు దీర్చుకొన గలుగుదు? నీ సాహస ధైర్యములకే నేమినివచించుదానను. ఒక్కనిమిష మాలస్యమైన మనకిట్లు మరలగలిసికానుభాగ్య ముండకపోవుగదా? నీ వంటి బుద్ధిశాలినియగు సఖిం బడసినగదా లోకంబున మనతోడి కాంతలెట్టి యిక్కట్టులనైన దప్పించుకొనగలుగుట " అని యానందపారవశ్యమున మాటలు తడబడ బల్కిన విని “నీ వింతగావచింపనేల ? మన మొకరి నొకరు గాపాడుకొనకున్న నేటికి?" అది యటుండనిమ్ము, నీ వెట్టు లీ దుష్టులబారి బడితివో వచింపుమన నా కన్నియ యిట్లనియె. “ఆనాడట్లు నీ కనులయెదుటనే నిద్రించితిగదా. ప్రొద్దుపోయినందునను నాయాసము నొంది యున్నందువలనను వెంటనే గాఢముగ నిద్రపట్టెను. అంత నేమిజరిగినదో నాకు దెలియదుకాని మేల్కని చూచునప్పటికి నొక గొప్ప యరణ్య

75