ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


గట్టఁ దీరములం గొట్టుకొను యమునాతరంగముల యార్భాటములును, యెండవేడిమివలనఁ దాపంబతిశయింప నుమ్మలికనొంది యాకస్మికముగఁ బొడమినట్టి మేఘములఁగాంచి యాహ్లాదమున గాలిచేఁ బింఛములు విరియ నాడు నెమలుల క్రేంకారములును, వర్షధారలకాశించి కాచుకొనియున్న చాత కపోతంబుల సంతోషారావములునుఁ, గమలాగారసంఘముల స్వచ్ఛందసంచారముల సల్పు పరమహంసలమగు మేము విషధరుండగు వీనింజూడ నోపమని మలంగిపోవుచున్న వనమే ఘోధయమునకు వెఱచి యమునయందలి శతపత్రంబులనృత్యంబుఁ జాలించి యాకసమున కెగయు రాయంచల సందడులును, వనతలంబు నెల్లెడలఁ బ్రతిధ్వనులుపుట్ట బొబ్బలిడు శార్దూలాది క్రూరమృగ భయంకర ధ్వానములునుఁ, దమతమ నెలవులఁ జేరంజను నానావిధ పతంగకుల కలకలంబులును, నేకమై యరణ్యమంతయు నల్లకల్లోలమగుచుండెను. ఎవరుగాని తమలోఁదాము కలహించుకొని యైకమత్యవిహీనులై మెలఁగుటచే నట్టివారలెంత బలవంతులైనను దుదకు మొదలంట నాశనమగుదురని లోకమునకంతయు నెఱుకపఱచు చున్నవియోయనఁ గ్రక్కిరిసి యొండొంటితోడఁ బెనవైచుకఁ బోయిన వృక్షజాలములు తప్పఁ దక్కిన గొప్ప గొప్ప మహీరుహములు సహితము వాయువునకులోనై కూకుడు వేళ్ళతోఁ గూడఁ బెల్లగిలి నేలఁ గూలుచుండెను. పరులెందఱెన్నిగతుల నాటంక పఱచుచున్నను ఘనులు దాముపూనిన కార్యముల విడనాడక సల్పుచునే యుండి, యవితీరిన వెంటనే

8