ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


సౌఖ్యముల నొనగూర్చునని తలఁచియున్న భక్తులకందఱకు సంయుక్తాదేవి ప్రత్యక్షమై యట్టి సౌఖ్యములే యొనగూర్చు చుండెను. ఇట్లు వీరిద్దఱు హస్తలాఘవ మొప్పఁ జిత్ర విచిత్రములుగ ఖడ్గములఁ ద్రిప్పుచు శత్రువుల వ్రేటులఁ దప్పించుకొనుచు హోరాహోరిగఁ బోరుచున్న తరుణమున నడిజవ్వన మందున్న రాజపురుషుఁ డొకడు ఖడ్గపాణియై శీఘ్రగమనంబున గొండనెక్కి వచ్చుచు " ఓరీ ! బలియొసంగఁ దెచ్చిన కన్యకకు సహాయముగవచ్చిన పురుషునకు గుడిచేతిపై బలమగు గాయము తగులుటచే వామహస్తమున బోరాడుచున్నాడు. ఆ కన్నియయు మిక్కుటముగ నలసియున్నది. కావున మీ రంద ఱుత్సాహమున బోరాడుడు." అను హెచ్చరిక వాక్యములు విని తోడనే రివ్వున బై కేతెంచి యచటనున్న వారినందఱి నొక్కుమ్మడి నఱక నారంభించెను. రాజపురుషునిధాటి కోర్వజాలక ద్వారము బయట నున్న వామమార్గు లొకఁడు వోయిన త్రోవను మఱియొకఁ డేగక చెల్లాచెదరై పారదొడగిరి. అంత నతఁడావరణమందుఁ బ్రవేశించి రెండుచేతుల రెండుకత్తులఁబూని విశృంఖలలీల శత్రుధ్వంసముఁజేయ నారంభించెను, సంయుక్తా యౌవనవంతులును దమకు వేరొక సాహాయ్యము దొరికినదని యుత్సాహమున విజృంభించి రిపుశాసన మొనర్చుచుండఁ జేయునదిలేక లోపలి వారునుఁ బిక్కబలిమిఁ జూపి పరువెత్తసాగిరి. అట్లు పరువెత్తు తరిఁ బ్రాకారపు గోడలెక్కి దుముకఁబోయి చీకటియగుటచే నొకచోటనుకొని వేఱొకచోటఁబడి యనేకులు ప్రాణముల

70