ఈ పుట ఆమోదించబడ్డది

రాణీసంయుక్త


పరిచారకుల కొందఱ నటగావలి యుంచి గృహములకు మరలి వచ్చిరి. అనంతర మీ దారుణ కృత్యములఁ జూడ నోపక కనుదొరంగి పోయెనో యన రవి పడమటి సముద్రమునఁ గ్రుంకెను. బాగుగఁ జీకటి పడిన వెంటనే నౌకరులేగి దీపముల వెలిగించి వచ్చిరి. రాత్రిఁ దొమ్మిద గంట లగుడు మతస్థులెల్లరు పురోహితుని యింటిదగ్గరఁ జేరిరి. నలుగురు మనుష్యులు లోని కేగి యొకగది తలుపుదీయ దానిలో నొండు దివ్యమంగళ విగ్రహము రూపముదాల్చిన వగపునుంబోలె నేలకంటుకొని పడి యుండెను. వా రామెను బైటికి రమ్మని యాజ్ఞాపింప నాహారము లేకపోవుట వలనఁ గాకపోయినను మితిలేని శోకభారమున లేవనోప కట్లే పడియుండ నామెం గొనివచ్చుటకు వ్యాఘ్రముల వంటి నల్గురు స్త్రీలను బంపిరి. వారుపోయి యా కన్యనులేపి చేతులతో నెత్తుకొనివచ్చి బయట సిద్ధముగనున్న నొక పల్లకి యందు కూరుచుండ బెట్టిరి. చెవులు బ్రద్దలగునట్లు రుంజా మొదలగు భయంకర వాద్యములు తమభీకర ధ్వానములచే దిశల గలఁగుండు పడఁజేయుచుండ మేళ తాళములతోఁ బల్లకినెత్తుకొని యందఱును గుట్టవైపునకు బయలుదేరిరి. పాపమా సవారియందున్న కన్యక కెట్టిగతి పట్టెనో యోచింపుఁడు. తల్లి దండ్రులు బంధువులు దోడుకత్తెలు మొదలగువారు బలసిరా వివాహోచిత వేషమున శుభ వాద్యములతో నూరేగదగు నాకన్యక దుర్మార్గులగుఁ బాషండులు వెంటరా మరణసూచక వేషముతో భయంకర వాద్యములు మున్ను ముట్ట నూరేగవలసి వచ్చెఁగదా

66