ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త

ఈ పైమాటలు చెవులఁబడిన వెంటనే పొంచివినుచున్న పాంథున కారాటమును, రోషభయ సంభ్రమంబులుసు నొక్క పర్యాయమే కలుగ వారి చెంతకేగ రెండడుగులు ముందుకువైచి సమయము కాదనుకొని యాగి తానువచ్చిన దారినే బయలు వెడలిపోవ నుంకించి మరల నేమనుకొందురో యను నాసఁబోవుటమాని యాందోళనమున నేమియుఁదోచక నిలువఁబడి యుండెను. అత్తరి భట్టుగారువచించిన వాక్యములకు ఢిల్లీ రాజ్యము తనకు జేకూరినంత సంతోషమునొంది యజమానుడు " వహవా ? ఎంతటి బుద్ధిశాలులండి మీరు? మీ కెట్టియుపకారము జేసియు మీ ఋణమును మాత్రము దీర్చుకొసజాలము" అని స్తోత్రముసేయ దొడగెను. అంత భట్టుగారు పట్టరాని సంతోషమున " మీరు నన్నింత పొగడవలయునా? నాపై సంపూర్ణ కటాక్షముంచుడు. ఇక నేను సెలవుఁబుచ్చుకొనెదన"ని యతనికి సలాములుగొట్టి వెడలిపోయెను. అంత నా యజమాని భటులఁ “ఈ దినమున నీ సంతోషపార్త వినుటఁజేసి మిమ్మందఱఁ క్షమించితిని. ఇక ముందిట్టి యకార్యముల సల్పితిరా మీ ప్రాణములఁ దీయించెదన"ని కఠినముగ బలికి వారిలో నిరువురికిఁ దనవద్దనుండ నాజ్ఞాపించి తక్కినవారితో " మీరీక్షణమున మన దండువిడిసియున్న స్థలమునకేగి యిపుడున్న తావుపదలి వేరొక చోటికేగవలసినదిగా నేనాపతితో వచింపుడు. వేవేగఁబొండ"ని సెలవొసంగ వారలును బయటరా నుద్యుక్తులై యుండిరి. అత్తరినిట దాగియున్న పాంథుడు' తానున్న చోటువదలి

38