ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము


రాజ్య మాక్రమించుకొన వచ్చును. సంయుక్తను జంపితిమన్న వార్త యొకవేళ జయచంద్రునకు దెలిసినను నతడు మనపై నెత్తిరాడు. వచ్చినను నతని నొక్కనిఁ బారదోలు సామర్ధ్యము మావద్ద గలదు. ఇన్నినాళ్ళ నుండియు బ్రసిద్దివడసిన ఢిల్లీ కనూజ్ రాజ్యములు రెండు మైత్రితో నున్నందున మాకిచటఁ గాలుపెట్టుటకు వీలుకలుగక పోయినదిగాని లేకున్న నీ దేశము నీపాటికే మావశము గావించుకొనియుండక పోదుమా. కానిండు ప్రస్తుతవిషయము గుఱించి యేమాలోచించెదరు ?

భట్టు : మహాప్రభో ! ఏలినవారిదయ చల్లగనుండవలెగాక దానికిదివరకే యేర్పాట్లఁ గావించియున్నాను.

యజ : ఏమికావించి యున్నారు ?

భట్టు : సంయుక్తను జంపునేర్పాటులే.

యజ : ఎట్లు?,

భట్టు : ఇక్కడికి కొన్ని మైళ్ళదూరముననున్న మధురానగరముచేరువ నొక గుట్టపైఁ బ్రసిద్ధికెక్కిన కాళికాలయము గలదు. ఆ ప్రాంతముల నుండు వామమార్గులనువారు తఱచుగ నా దేవికీ నరబలులర్పించు చుందురు. ఆ మతస్థుల నెటులైన బ్రోత్సాహపఱచి సంయుక్తం జంపు సుపాయముఁ జేసిరమ్మని నా నమ్మిన నేవకుని నొకని నిదివరకే పంపియున్నాను. వాడన్ని కార్యములు చక్కబఱచియే యుండును,

37