ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము


యజ : అయినది కానిండు. తరువాత వచించెదను. ఇప్పుడీ జాబునఁగల వృత్తాంతములేమో చూచి చెప్పుడు. అని లేఖ నొకదాని నందియ్యఁ గైకొని భట్టుగారిట్లు చదువఁ దొడఁగిరి.

"మనోహరా ! తరణి సందర్శనంబులేనిచోఁ బద్మిని ప్రాణముల భరింపనోపదు. దీనికై ననేకములగు నితరమదకలములు కాచుకొని యున్నవి. లోకబాంధవ సమానుండవగు నీవీ పద్మినిం గరుణించి పరనాగముల వాతఁబడకుండ దక్కించు కొనవలయునని వేడుకొనుచున్న దానను.

"సంయుక్త"

జాబునందలి సంగతులువిని పొంచియున్న బాటసారి విస్మితుడై తాను పోయినదనుకొనిన వస్తువుతన కెంతమాత్రము సంబంధము లేని పరులవద్ద నగుపడినచో మానవుండెట్టి స్థితియందుండునో యట్టి యవస్థఁ బూనియుండెను. అంత మరల భట్టు గారు యజమానుడు నిట్లుమాటలాడసాగిరి. -

యజ : భట్టుగారూ ! దావియందుగల సంగతులేమి ?

భట్టు : మఱేమియులేదు. కన్యాకుబ్జనగర మేలుచున్న జయచంద్రునకు సంయుక్త యనునొక కూతురు గలదు. ఆమె మన చక్రవర్తిని వలచియున్నది, ఈ యుత్తర మామె లిఖించినదే !

యజ : ఏమని ? ఎవరి పేరు?

35