ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త

 కొని మొగములపై దీనత్వముదోప " మహాప్రభో ! రక్షింపుడు, చేతఁజిక్కినవా డెందుఁబోవునను ధైర్యమునను వానివలన మనకేమైన సహాయము దొరకగలదనియు నుపేక్షచేసినారము " అని విన్నవింప నుగ్రుండై యా దొర "ఛీ ! మూడులారా ! నే గావించుచున్న పన్నుగడలన్నిటికి విఘ్నములు సేసితిరి. వాడు చావక బ్రదికియే యుండెనా మనకీ యార్యావర్తమున నిలుచుట కావంతయు నవకాశముండదు. నే నెన్ని టక్కులబన్ని పృథ్వీ రాజునొద్ద నేమిసేయు చున్నదియు మీ కే మెఱుక. ఆహా ! ఎంత పని గావించితిరిరా దుర్మార్గులారా ! అని దీర్ఘవిశ్వాసము వదలి మిక్కుటముగ గలిగిన రోషమువలన నొడలెఱుంగక చేతనున్న హుక్కాగొట్టము నావల బారవైచి సోఫాకు జేరగిలబడి కూరుచుండి యుండెను. అత్తరి లోపలినుండి పరిచారకు డొకడేతెంచి "సర్కార్ ! ఇదే మీ యాజ్ఞప్రకారము భట్టుగారిఁ గొనివచ్చి నాడ" నని పొడుగుపాటి బక్కపలచని నల్లని మనుజుని దెచ్చి చూపించెను. వెంటనే యజమాని లేచి యావచ్చిన మనుజునకు సలామొనరించి "రండిభట్టుగారు ! వచ్చికూరుచుండుఁడ"ని యాసనము జూపింప నతడు దానిపై నాసీనుడయ్యేను. అప్పుడు వారిరువు రీ విధమున మాటలాడసాగిరి.

భట్టు : ఈ దినమున వీరలేమైన గ్రొత్తవార్తలు దెచ్చినారా?

యజ : త్వరలో మా కందరకు నిక్కడినుండి యుద్వాసనగునట్టి యుపాయము గనిపెట్టుకొని వచ్చినారు.

భట్టు : ఏమి ! అట్లనెదరేల ? .

34