ఈ పుట ఆమోదించబడ్డది

వినతి

"రాణీసంయుక్త" యను గ్రంథము చరిత్రవిషయక నవల (Historical Novel) ఇందలి నాయకుఁడు పృథ్వీరాజు. నాయిక సంయుక్త, ఈ నాయిక నామము ననుసరించియే ఈ గ్రంథమునకు “రాణీసంయుక్త" యని పేరుపెట్టబడియె. ఈ రాణిసంయుక్త యొక్క చరిత్ర మాంధ్రములో మొదట కీర్తిశేషురాలగు శ్రీమతి అచ్చమాంబగారు తమ అబలాసచ్చరిత్ర రత్నమాలలో వ్రాసిరి. ఆ కథా భాగమును అనుసరించియు, నితర భాషలలోనుండి కొంత చరిత్రాంశములమ సంగ్రహించియు నీ నవల (Novel ) వ్రాయఁబడినది .

కధానాయకుడైన పృథ్వీరాజు క్రీ.శ. 1159లో జన్మించి క్రీ.శ. 1193 లో స్థానేశ్వర యుద్ధమునందుఁ గీర్తిశేషుఁడయ్యెను.

కధానాయిక యగు సంయుక్త కనోజ్ దేశాధిపతియగు జయచంద్రుని కూతురు. ఈతనికిని పృథ్వీరాజుకును గలిగిన వైరమువలన నా కాలమున నున్న క్షత్రియులలో రెండుకక్షలుపుట్టి యా భేదముకతననే యీ దేశము తురకలపాలిటఁ బడియె. ఈ కథాభాగమంతయును, స్వదేశ స్వాతంత్ర్యమును కాపాడుటకై నాయిక నాయకులచేఁ జేయఁబడిన పరిశ్రమయు నీ గ్రంథమునందు వర్ణింపఁబడినవి.

హిందూదేశముయొక్క స్వాతంత్ర్యమును హరించిన షహాబుద్దీన్ మహ్మద్ గోరీ యన్నవాడు ఆఫ్‌గన్‌స్థానములోని గజ్నీరాజ్యమునకు సుల్తాన్. ఈతఁడు తన యన్నయగు గ్యాస్‌ఉద్దీన్ ఆనువానితోఁ గలసి క్రీ. శ.1157 మొదలు క్రీ. శ. 1202 వఱకు జములు సుల్తాన్‌గాను, అతని అన్న పోయినతరువాత 1206 వఱకు నొక్కడే రాజ్యముచేసెను.


ఈ గ్రంథములో వర్ణింపఁబడిన కాలము హిందూదేశ చరిత్రలో మిక్కిలి ముఖ్యమైనది. ఈ కాలమునందు మన స్వరాజ్యముపోయి పరరాజ్యము వచ్చెను. అప్పుడు మనవాండ్రు ఏయేకారణములవలన రాజ్యమును పోగొట్టుకొనిరో కనుగోనుట కిట్టి చరిత్ర విషయక నవలలు మిక్కిలి యుపయోగకరము.

చెన్నపట్నం ,

20-3-1908

సంపాదకుఁడు

కొమర్రాజు వెంకటలక్ష్మణరావు M.A.