ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియుకటన ప్రకరణము


గాఁగలవు. నామాట కాదనక యిందున కొడంబడుఁడు. మీరతనికిఁ దోడ్పడ కుండినఁజాలు. నే స్వయముగా నతని గడముట్టించెద. మీ రిందులకు సమ్మతింపనిచో మనము పడవలసిన బాధలకు మితియుండదు. కాన నాలోచించి కొనుఁ" డన వారుమువ్వురు మొగములు చూచుకొనుచు నౌరా ! వీనిదుశ్చింత యని తల పోయఁగడగిరి. అంత మరల భట్టు " మీ రూరకమొగములు చూచుకొనుటవలన నేమిప్రయోజనము ? మనమిప్పుడు కొంచె మించుమించుగఁ గన్యాకుబ్జముఁ జేరవచ్చినాము. ఆపట్టణ మిచ్చటకు నైదారామడలకంటె యెక్కువలేదు. పురముఁ జేరిన పిదప నతనిజంపుట మన తరముకాదు. ఆ కార్య మిటువంటి స్థలమందే జరిగినయెడఁ బులియెత్తుకొని పోయినదనిగాని రణముననే మృతినొందినాఁడని గాని చెప్పి పౌరుల నెమ్మది పఱచ గలము. కావున నేదోయొకటి నిర్ధారణ సేసుకొని నాతో వచింపు" డన వారుమువ్వురు రేపాలోచించి చెప్పెదమనిరి. తరువాత జయచంద్రుడు వచ్చుటచే నాఁటి కాప్రసంగ మాపివేసిరి. ఆమఱునాఁడు భట్టు స్నానమొనరింప నక్కడికిఁ గొంచెము దూరముననున్న నొకసెలయేటికి బోయి యుండ మ్లేచ్చ సేవకులు రాజుదగ్గర కేతెంచి " రాజేంద్రా ! మీరింతకాల మీ భట్టు నెట్లు నమ్మియుంచుకొంటిరో యూహింపజాల కున్నాము. వీడు మిమ్ము గడతేర్చి కన్యాకుబ్జము నేలదలఁపు గలిగియున్నాడు. నిన్న మీ రావలకేగియున్న సమయమున నతడు మావద్దకు వచ్చి మిమ్ముజంప మమ్ముగూడ సహాయ పడవలసినదని కోరినాడు."

229