ఈ పుట ఆమోదించబడ్డది

ముప్పదియొకటవ ప్రకరణము


శిబిరముఁజేరి మంత్రులు దండనాయకులు మొదలగువారు చుట్టునిదురించియుండ దాసంయుక్తం దలఁచుకొని విలపించుచుఁ గొంతసేపటి కట్లే నిదురగూర్కెను. అటు లార్యసైనికు లెల్లరు మైమఱచి గాఢనిద్రపరవశులై యుండ రాత్రి నొంటి గంటవేళ మ్లేచ్ఛులందఱును సుల్తాన్ యాజ్ఞప్రకారము ఖడ్గపాణులై వారిమధ్యంజొచ్చి యొక్కొక్కని దీర్ఘనిద్రఁ బుచ్చ సాగిరి. సుల్తాన్ బలశాలులగు నిరువదిమంది భటులఁ గూడుకొని చక్రవర్తియున్న శిబిరముఁ బ్రవేశించి నలుప్రక్కలఁ బరుండి యున్నవారల వధించి చక్రవర్తి గొంతుఁగోయఁ బోవుతరుణమున నతఁడుల్కిపడిలేచి మ్లేచ్చులఁగాంచి విభ్రాంతుఁడై తనఖడ్గమును జేఁబూని వారిపైఁ దిరుగఁబడెను. ఈలోపలనే రెండుమూఁడు ఖడ్గప్రహారములు వెన్నున దగిలెఁగాని వానికి వెనుదీయక పోరాడమొదలిడి సుల్తాన్ వెంటవచ్చిన వారిలో నొకని దక్కువగ నందఱఁ గడదేర్చేను. ఆత్తరి సుల్తాన్ చక్రవర్తిమీదికి రా నతని క్రింద పడతన్ని నరుకబోవ మ్లేచ్చభటుఁడు వెనుకనుండి వచ్చి చక్రవర్తి కంఠముపై బలమగు దెబ్బకొట్టెను. ఆ దెబ్బతో నతఁడు నేలగూల సుల్తాన్ పరువెత్తి పోయెను. ఇట్లు తెల్లవారులోపల నార్యులఁజంపి మ్లేచ్ఛులందఱు సుల్తాన్ కావార్త నెఱుగింపఁ గృతకృత్యుఁడై యతఁడు కన్యాకుబ్జము నాక్రమించుకొన కొంతసేనతో గుతుబుద్దీనును బంపి తాను, మిగల సైన్యముం గూడుకొని డిల్లీకేగఁ బయనమై పోయెను. అంత నిక్కడ ప్రబలమగు నార్య సేనయంతయు

227