ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


యార్యావర్తము వారిచేఁగాక సకల విదేశీయులచేఁ బొగడ్తలఁ గాంచి, నిజయశోమరీచుల దిక్కుడ్య భాగంబుల వెలుఁగఁజేసిన మహారాణియగు సంయుక్త యట్లు జీవముల వదల నక్కడ నున్న వారందఱు మహా సంక్షోభమున మునిగిపోయిరి. అంద రామెచుట్టుజేరి "హా ! లోకజననీ ! హా ! దివ్యమంగళ విగ్రహా ! హా! మహారాణి ! సంయుక్తాదేవీ ! అనాధలమగు మమ్మందఱ నిట్లు దయమాలి నీ వొంటరిగ నెచ్చటికేగితివి? తల్లీ ! కన్న బిడ్డలకన్న నెక్కుడగు ప్రేమంబున మమ్ముఁ జూచుచుందువే ! ఎవరింక మమ్మాట్లాదరించి కన్గొనువారు? నీ యీ వృత్తాంతము మే మెట్లు నీ నాధునకు దెలియబఱచగలము, అతఁడీ వార్తవిన్న పిదపఁ బ్రాణముల భరించి యుండునని తోచదు. నీవు లేని మా జన్మ మేటికి? హా ! ఢిల్లీ నగర రాజ్యలక్ష్మీ ! పోయితివా” యని యేడ్చుచు చేయునదిలేక రాజోపచారంబుల నామెశరీరము దహనము గావించి మతిపోయినవారలై యందఱు నలీఘరు వద్దకురాఁ బయలుదేరిరి. ఆట నలీఘరుదగ్గర ఘోరమగు రణము జరుగుచుండ జక్రవర్తి శిబిరమున గూరుచుండి తన ప్రాణకాంత కడనుండి రెండుదినములైనను వార్తరానందుల కాలోచించు చుండెను. అత్తరి మహాబుద్ది మొదలగువారు. దీనవదనులై శిబిరము బ్రవేశించి యతనికి నమస్కృతులఁజేసి నిలువ “సంయుక్త యెక్కడ" నని యతఁడడిగెను. అందుల కొక్కరు బ్రత్యుత్తర మీయక తలలు వంచుకొని నిలువఁబడియుండిరి. వీరిస్థితింగాంచి చక్రవర్తి యనుమానో పేతుడై " మీరందఱేల మాటలాడరు ?