ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సం యుక్త


లతో బోరాడ నన్ననుగ్రహింపు" డని వేడుకొనెను. పృధివీరాజాశ్చర్యకలితుడై నీ విట్లగుటకు గతమేమన నా బుడుతఁ డిట్లనియె. "రాజా ! నా తండ్రిగారు తమకొఱకై పోరాడుచు మహోబాసంగరమున మృతినొందినారు. కాని తరువాత శరీరముకొఱకు వెదక నది యెద్చోటను గన్పించలేదు. ఇప్పుడు నాతో గలిసియున్న నా స్నేహితులు గొందఱు మా తండ్రి రణమున కేగలేదనియు, నతఁడందు లేనేలేడనియు వచించుచున్నారు. అందుచే మా వంశీకులు యుద్ధములందు నిలువ సమర్థులని స్వయముగ దెలియబఱచుటకై యిట్టులడిగితిని." అన చక్రవర్తి యతని యెడల దృడానురాగము గలవాడై తన దగ్గరకు లాగుకొని యతని దక్షిణకరమును బట్టి పైకెత్తిన వెంటనే సభాసదులెల్లరు నిశ్శబ్దముగ గూరుచుండి యుండిరి, అత్తరి జక్రవర్తి కోపమును, దుఃఖమును పొడమ నిట్లనియె. "బుద్ధిహీనులగు నా పడుచువారలంద ఱైక్కడ ? నా ప్రక్క తోడై నిలిచి ప్రాణముల కాశింపక పోరాడిన సత్వవంతుని చరిత మాలకింప వారి నందఱి నిటకుఁ గొనిరండు. మహోబా యందు జరిగిన ఘోర సంగ్రామమున నితని తండ్రియు, నేనును గాఢమగు గాయములు దగిలి పడిపోయితిమి. మొదట నాకు స్మృతియే లేదు. మరల నా కించుక తెలివి కలుగు నప్పటికి రణము పరిపూర్తి యయినది. జయము మాకే కలిగినది. ఆ సమయమున శక్తిహీనుఁడనై నెత్తురు వరదలు కారుచుండ బడియుండ నేను చచ్చితినను తలపున డేగలు

202