ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియేడవ ప్రకరణము


నగరమున నుండు కొద్దిసేనకును తక్కిన నీ తోడికాంతలకును నిటరక్షకు లెవ్వరు నుండరు. అట్టి తరుణమున నా భారమంతయు నీ యదియే " అన సంయుక్త మరల " నాధా ! నా సఖియగు మంజరిని మీ రెఱిగియే యున్నారుగదా. ఆ కన్నియ యే విషయము నందును నాతో దీసిపోవునదిగాదు. నాకన్న మిన్న యనియే చెప్పనొప్పును. ఆమెను మనము లేని కాలమున నిక్కడ నుంచవచ్చును. ఆమె యిప్పుడు కన్యా కుబ్జనగరముననే యున్నది. ఆమెకడనుండి జాబు రానిదినము లేదు. మరియు లేఖల దెచ్చిన వారలామె నా కొఱకై పరితపించుచు గృశించి పోవుచున్నదని వచించినారు. నాకు నామెంబాసి యుండుట వలన నెట్లోయున్నది. ఇత్తరి బిలుపింప తగిన సమయము వచ్చినది కావున జాబునంపి రప్పించెద. నాయుత్తరము గాంచిన వెంటనే బరువెత్తుకొని వచ్చును. ఆమే నిటనుంచి పోయిన మనకేమియు భయములేదు. నాకు మీతో యుద్ధమున కేతేర గడు నభిలాషగ నున్నది కాన నింతగా వేడుకొనుచున్న దానను. కాదనక యనుగ్రహింపు " డని పలుకుచున్న తన ప్రాణకాంతను వలదసనోపక చక్రవర్తి యామెధైర్య పరాక్రమముల స్వయముగ జూచి యున్నాడు కాన నటులేయని సమ్మతించెను. అంత నామె మంజరి కొక లేఖ వ్రాసి యొకనికిచ్చి మా తండ్రిగారి పట్టణమున కేగి యీ వుత్తరము జూపి మంజరి వెంటగొని రమ్మని పంపెను. వరిచారకుడు లేఖ గైకొని చనిన పిదప నా దంపతు లిరువురు రణమును గూర్చి మరికొన్ని సంగతులు మాటలాడుకొన వేరొక మందిరములో కరిగిరి.

197