ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము


మరణము సంభవించుట నిశ్చయమని తలచి చతురులను నూర్గురు సైనికులను, గుతుబుద్దీనును వెంటగొని యొకరాత్రివేళ పారిపోయెను. మఱునాఁడు రణమునందు సుల్తాన్ గానరాకుంటచే నతఁడు రణములోఁ జచ్చియుండఁబోలు నని మహ్మదీయులు శౌర్యహీనులై పరుగిడఁజొచ్చిరి. ఆర్యు లొకనినైన దప్పించుకొనిపోకుండ మట్టు పెట్టుచుండిరి. కొన్నిదినము లగునప్పటికే సుల్తాన్ సైన్యము సంపూర్ణముగ ధ్వంసమయ్యెను. హత శేషులగువారిఁ బట్టించి ఢిల్లీకి ఖైదీలుగ బంపి కుంభీలకుఁడు తన జయవార్తను జక్రవర్తికి దెలియబఱచెను. శాత్రవుల యుద్దోపకరణములన్నియు నార్యుల పాలఁబడెను. కుంబీలకుడట్టి మహాజయముతో ఢిల్లీని ప్రవేశించెను. అతడు రాజధాని జేరినదినమున ననేకములగు నుత్సవములు జరిగెను. చక్రవర్తియు మహోల్లాసము నొంది రణప్రావీణ్యము గనుబఱచిన సేనానుల కనేక బహుమతులొసగి మన్నించెను. సంయుక్తయు దన నాయకునకు గలిగిన జయమువలన బరమానందభరితయై రణమున గతించిన శూరుల కాంతల రప్పించి వారి ననేక గతుల నోదార్చుచు, మన్నించుచు నట్టివారలకుఁ దగిన జీవనోపాయంబుల గల్పించి యొసగెను. మ్లేచ్చుల యార్బాటము లడుగంటి నందున దేశమంతయు నెమ్మదియై పౌరజనంబులెల్ల సౌఖ్యంబురాశి నోలలాడుచుండిరి.

181