ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త సౌఖ్యము


సౌఖ్యము కేవల మనుభవైకవేద్యమే గాని వేరుకాదు. జక్రవర్తి స్నిగ్ధమై కళలదేరుచున్న యా బాలిక మోమునుగాంచి మోహమగ్గలమై త్రిప్ప ముద్దిడుకొనబోయెను. గాని యామె తటాలున ముఖము నవతలకు త్రిప్పుకొని చేయివిడిపించుకొని యించుక దూరమునకేగి నిలచెను. అంత నతడు మరల నామెను గలుసుకొన బోవుచుండఁ బొదరింట డాగియున్న బైరాగి బయటికేతెంచి యెదుటనిలచెను. చక్రవర్తి యతని గాంచుటతోడనే తత్తరమంది నమస్కరించి నిలువ “రాజేంద్రా ! నీపై మోహము గలిగియున్నను నీపె యింతవరకుఁ గన్యకయేగదా. గురుజనంబులు లేనియెడ నీమె నొంటరిగఁ జేపట్టుట యుక్తమగునా ? ఇప్పుడీమెం దగిన పరిచారికలతో నంతఃపురముఁ జేరఁబంపుము. నీవు నీ మందిరమున కేగియుండుము. పురమంతయు నలంకరింప నాజ్ఞాపించి రేపే మీ వివాహము నెరవేర్చెద " నని బలుక యోగికి మారుబల్కనోడి యభీప్సిత కార్యసిద్ధి కాటంకము లెన్నైన గనుగుచుండు ననుకొనుచుఁ జక్రవర్తి యచ్చోటు విడచిపోయేను. సంయుక్తయుఁ దరువాత దన్నుఁ జేరవచ్చిన పరిచారికలం గూడి రాణివాసమున కరిగెను. బైరాగి వివాహప్రయత్నము లొనరింప వెడలిపోయెను.

174