ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదిరెండవ ప్రకరణము

ప్రచండుని నోడించిన మరుసటి దినమునఁ దెల్లవారినతోడనే చక్రవర్తి నానతి నాతతాయి తమసైన్యమును గన్యాకుబ్జము ముట్టడింప నడిపించెను. ప్రచండుని పరాజయంబువిని జయచంద్రుఁ డత్యంత రోషమూని చక్రవర్తిం జంపిగాని రణము మానఁగూడదని తన సేనాపతులఁ బురిగొల్పు చుండెను. వినయశీలుండు చక్రవర్తితో సంధి గావింప ననేక ప్రయత్నములు సలిపెఁగాని యవన్నియు నిష్ఫలములై నందునఁ దాను గయ్యమున సంబంధము గలుగజేసుకొనక దూరముగనుండి సమయము వచ్చిన రాజునకుఁదోడ్పడ దలఁపూని యుండెను. చక్రవర్తి నగరమున కెనిమిది మైళ్ల దూరమున డేరాలు వేయించి సేనను విడియింపఁజేసి దాని మూఁడు భాగములుగ విభజించి యందొక భాగమునకు గంకటుఁబతిని జేసి తూర్పు దిశయందలి ద్వారమును

151