ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త


వెన్నీక నిలచి రణ మొనరించుచు వేరొకబారు కత్తింగొని ప్రకంపను బొడువంబో దానిదప్పించుకొని యతని నొక్క పోటుఁబొడచి ప్రకంపనుఁడు విజృంభించెను. ఆ దెబ్బతో జయచంద్రుని సేనాపతి నేలకొరగి పడిపోవ నదివరకే నాశనమై యున్న తక్కినసైనికులును బలాయితులు కాసాగిరి. మఱి కొంద రంత్య సాహసముంజూపి మడియుచుండిరి. రణరంగ మంతయు బీనుంగుపెంటలతో నిండుకొనిపోయి భీభత్సము గొల్పుచుండెను. రక్తము కాలువలు గట్టిపాఱుచుండెను. అంత రణరంగమంతయు జర మాశా ఫలకంబున బ్రతిఫలించుచున్నదో యన శోణమరీచులు రాజిల్ల సూర్యుఁ డస్తమింపఁ బోపుచుండెను. ప్రచండుని సేనయందలి దుపాకులు ఫిరంగులాది గాగల యుద్ధ సామగ్రులన్నియు జక్రవర్తి పాలంబడెను. సంగరము పూర్తియైన పిదపఁ జక్రవర్తియానతి నాతతాయి గాఢమగు గాయముచే వేదనపడుచున్న ప్రకంపను దగువారలచే నచటికి గొంతదూరమున నున్న రాజవైద్యశాల కనిచి తక్కుం గల భటుల నెల్లర మఱియొక వైద్యశాలకు జేర్ప బరిచారకుల కాజ్ఞాపించెను. వారును జావక బ్రతికియున్న ప్రతిక్షత దేహుని వైద్యశాలకు జేర్చుచుండిరి. అక్షతదేహులగు తక్కిన సైనికులెల్లరు రణరంగమునకు దూరముగఁబోయి యటనున్న నొకచిన్న ప్రవాహమునందు దేహముల శుభ్రపఱచుకొని యుచితాహారంబుల భుజించి కన్యాకుబ్జనగరపు ముట్టడినిగూర్చి మాటలాడుకొనుచు బొద్దు గడుపుచుండిరి.

144