ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


వదలక పైకి జక్రవర్తితో నిష్టముగ నున్నట్లు నటించుచు లోలోపలఁ గుట్రలు పన్నుచుండెను. చక్రవర్తి మ్లేచ్చుల జయించి వచ్చిన దినమున తమ గుట్టంతయు నతని కెఱుక పడెనని విని కరీముగారితో నైన వచింపక మధ్యరాత్రి బయలు దేరివచ్చి యిటఁజేరెను. ఇటు లీ నగరముజేరి చక్రవర్తిపై నెపము వెదకుచున్న జయచంద్రునకు మహోపకారము గావించినవాఁడయ్యెను. మఱునాడు కొలువుదీరియున్న సమయమున జక్రవర్తి వ్రాసినది కాకపోయినను అతని హస్తలిఖిత మని జాబునొకటి జయచంద్రునకు జూపింప దానియం దిట్టులుండెను.

" స్వస్తి శ్రీ జయచంద్రునకు,

నీ గారాబు కుమార్తె సంయుక్త నన్ను వలచియున్నదని యనేకులవలన వినియుంటి. నాకును నామెపై మిక్కుటమగు మోహముకలదు. నాతో మైత్రిఁ బాటింపఁ దలఁచితివా శీఘ్రముగ నామెను నాకొసంగి వివాహముఁజేయుము. లేకున్న రాక్షస వివాహముననైన జేకొననిశ్చయించి యున్నాను." అనిచదువుకున్న వెంటనే దెబ్బదిన్న త్రాచుబామువలె దీర్ఘ నిశ్వాసాన్వితుఁడై కన్నులెఱ్ఱజేసి లేచి " ఔరా ! వీనిదుర్మదము. వీనికి నాగారాబు గూతునర్పింపవలయుగా, లేకున్న రాక్షసవిధి గైకొను పాటివాఁడా ? చక్రవర్తిపదవి లభించెనని కన్నులు నెత్తికెక్కినవిగాబోలు ఇంతవరకు దగుకారణ లేనందున నూరకుంటిని." అని యవలోకన మాత్రమున రణమునకు వెడలివచ్చు నంతటి కఠినముగ బృధ్వీరాజునకు లేఖవ్రాసి పంపించి యుద్దమునకు సంసిద్ధులై యుండవలసినదని దండనాయకుల కాజ్ఞాపించి వెడలి పోయెను.

118