ఈ పుట ఆమోదించబడ్డది

పదునారవ ప్రకరణము

అఁట గన్యాకుబ్జ నగరమందు జయచంద్రుఁడు తన కూతురు చేసినపనికి మండిపడుచు నంతఃపురముఁజేరి రోషసంభ్రమములు ముప్పిరిగొన హా! తానొకటితలఁచిన దైవమొకటి తలఁచుననుట తథ్యమయ్యెను. ఆ నిర్భాగ్యునెడల నే సలిపినదానికి నాకూతురిట్లు వ్యతిరేకముగా మన్నించునని కలయందైనఁ దలచితినా? దీనికిట్టిదుర్బుద్ది పొడమనేల! సాటిరాజులతో నాకు తలవంపులు తెచ్చినదిగదా ఈరాకాసి. దీనినేమి కావించినను బాపమగునా? దీని నింతింతకండలుగ గోసి కాకులకు సైచినను బాపముకలుగదు. దీనికి నేనేమివిషముబోసితిని. ఇది పుట్టకుండిన నాకేచింతయు లేకపోవుగదా! ఇదివరకు పోయిన దట్లేపోక మరల నేటికి దాపరించినది? ఆహా! నా హృదయమంతయు రవులుకొని పోవుచున్న దేమిసేయుదు? అని తలపోసుకొనుచు

113