ఈ పుట ఆమోదించబడ్డది

రాణీసం యుక్త


రాజ్యమునందు కొన్ని దుష్కార్యము లొనరింప మొదలిడి తుదకొకస్త్రీని గామించి యామెకుఁ దనవాంఛ నెఱుంగింప నందులకామె సమ్మతింపదయ్యె. ఇటులుండ నామెభర్తకార్యాం తరమున మఱియొక గ్రామమునకేగి మఱలి స్వగృహమునకు వచ్చుచుండ దారిలో గొందఱు తలారులనుంచి వానిజంపించి యాశవము నీమె యింటిముంగిట వేయించి తెల్లవారినవెంటనే కొందఱు భటులనంపి పతిని జంపినదని యామెందెప్పించి యాసంగతి దానే విచారణసేసి యామెకు మరణదండన విధింప వలసినదిగ జక్రవర్తికిఁ దెలియబఱచెను. చక్రవర్తి స్వయముగ మఱల విచారణచేసి తనకుఁ దృప్తికరముగ ఋజువుకానందున దానిని గొట్టివేసెను. అందులకా బట్టు గారీర్ష్యవహించి నృపాలు నెటులైన రాజ్యపదభ్రష్టునిజేయ మాయోపాయముల వెదకుచుండెను. ఇతని కుట్రల కన్నిటికి నా నగరమందె మఱియొక ముఖ్యాధికార పదవియండున్న కరీమను మ్లేచ్ఛుడు తోడుపడుచుండెను. ఈ కరీమ్ ఆఫ్‌గన్ దేశస్ధుఁడు. ఈ తరుణమున సుల్తాన్ మహ్మద్‌గోరి యనునతడు లాహోరున రాజ్యము చేయుచుండెను. పదునొకండవ శతాబ్దారంభమున మహ్మద్ గజినీ యార్యావర్తముపై దండెత్తి లాహోరురాజగు జయపాలుని నోడించిపోయెను. జయపాలుడు తనకుఁ గలిగిన యపమానము భరింపజాలక తన పుత్రుఁడగు నానందపాలుని సింహాసనముననుంచి తా నడవికి బోయెను. ఎనిమిది సంవత్సరములు కడచిన పిదప మఱల గజినీవచ్చి యానందపాలుని

106