ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్తి


తానా దినమున జేయఁబూనుకొన్న కార్య మతిదుర్ఘటంబు గావున దండ్రి నెట్లుదిరస్కరింతునా యని కొంతతడవును, దిరస్కరింపనిచోఁ దనకోరిక నెరవేరుటకు వేరొండు మార్గము గలుగదని కొంతసేపును విచారించి తుదకెటులైన దన యిష్టమే నెరవేర్చుకొన దలచియుండెను. అంత గొంతసేపటికి రాణి యానతిఁ జెలికత్తెలు మున్నగువార లేతెంచి నామె కభ్యంగన స్నానాదికములఁ జేయించి యలంకరించి తల్లిదగ్గరకుఁ గొంపోయి విడచిరి. ఆనాఁ డెనిమిది గంటలకు స్వయంవర ముహూర్త మేర్పఱుపఁబడి యుండెను. దివాణములోపల స్ఫటికశిలా వినిర్మితమగు నొకవిశాల చతుశ్శాలామంటపము స్వయంవర కార్యమున కుద్దేశింపఁబడెను. ఈ మంటపాంతరమునఁ దూర్పుప్రక్క జయచంద్రుడు నతని సంతతియు, నుత్తరమున రాజ్యమందలి ముఖ్యులును, పశ్చిమ పార్శ్వమున స్వయంవరాగత రాజమండలియు, దక్షిణమున బరరాజుల వెంటవచ్చిన ప్రధానులు మున్నగువారును నాసీనులగుటకుఁ బీఠము లమర్పఁబడి యుండెను. తెల్లవారినది మొద లొక్కరొక్కరువచ్చి యుచితాసనములఁ బరివేష్టింపసాగిరి. వీధులయందు శకటముల రాకపోకలకు విధి విరగడలేకుండెను. అంతఁ బ్రతీహారులేగి సకలమును విన్నవింప జయచంద్రుఁడు పురోహితులు ముందునడువ మంటపమున కేతెంచి సింహాసన మధిరోహించెను. పురోహితు నానతి బరిచారికలు చని పిలువ సంయుక్త యుచితాభరణ భూషితురాలై తల్లితోఁ గూడి దివ్యమంగళ విగ్రహముంబలె

102