ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము.

85

గారావును చంపితివి. నిర్దోషియగు రమేశబాబును తుపాకీతోఁ గాల్చితివి. అసంఖ్యాకులను పోలీసులను జంపితివి. నేఁ డీ వేశ్యాగృహముం జొచ్చి యీకాంత నొకతెను ఖూనీచేసితివి. ఇన్ని ద్రోహములకు నీ వేసమాధానము చెప్పఁగలవు ?

శంక - ఎన్ని ద్రోహములైన చేసియుందునుగాని, యీకాంతను మాత్రము నేను ఖూనీచేయలేదు. లేదు. అన్యాయమైన వాచాదోషమునకు పాలుగాకుము.

తుల - ఏమీ ! దీనిని చంపలేదా ?

శంక - లేదు.

తుల - చీ ! అనృతాలాపీ !-

శంక — నేనుకాను; అనృతాలాపివి నీవు.

తుల - దురాత్ముఁడా ! నీతో వాగ్వివాదమున కిది సమయముకాదు. నాకు సమాధానము చెప్పినట్లుగాదు. న్యాయపీఠమునెదుట చెప్పుకొనుము. (అన్నపూర్ణతో) ఓయీ ! చూచెదవేమి ! వీనిని బంధింపుము.

శంక - ఏమీ ! నన్ను బధింపఁదలచి వచ్చితివా ! వలదు సుమా ! ప్రాణాపాయకరము సుమా !

తుల - ఆ ప్రాణాపాయమేమో చూడఁదలఁచియే వచ్చితిని.

శంక - మామా ! నన్ను బంధించుటకన్న వేఱుమార్గము లేదా ?

తుల - “మామ, అల్లుడు” అను దుష్ప్రసంగము మానివేయుము. మనకట్టి సంబంధములు వదలి చాలకాలమైనది.

శంక - ఆఁ ! వట్టిమాట. ఎట్లు వదలును ? కాలుకడిగి కన్యాదానము చేసితివే ! అట్టిసంబంధ మింత శీఘ్రముగా వదలఁగలదా ?

తుల - ఓరీ ! నీనక్కనై చ్యములను మానివేయుము. నీ కిదే యంత్య కాలము.