ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాంకము.

73

దానను గాను. విశ్వసింపుము. నామర్యాదఁ దీసిన నీకు వచ్చు పుణ్యమేమి ?

బట్ల - ఊఁ! పుణ్యము!. పాపము!- పాపపుణ్యములుచూచుకొనినచో నొక్కనాఁడైనను మే మీవృత్తి చేయఁగలమా ! విను విను, మెల్లఁగా చెప్పినప్పుడే దారికి వచ్చుట మంచిది. వ్యవహారమును ముదురనిచ్చిన లాభములేదు సుమా!

ప్రభా - (స్వగ) ఆహా! ఇ దెట్టిపాటు వచ్చె నాకు! సర్వసంగపరిత్యాగము చేసికొనినను నాపాపఫలము పెనుభూతమై నన్ను వెంటాడు చున్నదే! ఏమి చేయుదును? (ప్రకా) అయ్యా! నావద్ద నే నిప్పుడు ధరించియున్నపట్టుచీరతప్ప వేఱు ధనమేమియును లేదు. దీనిని కొనిపోయి నీఋణముఁ దీర్చుకొన నంగీకరించితివా సంతోషముతో నిచ్చెదను.

బట్ల - అట్లే. నే నీసంగతి నాయజమానునితోఁ జెప్పి, అతఁ డంగీకరించినచో తీసికొనివెళ్ళెదను. నేను వచ్చువఱకు నీ విందే యుండవలయును.

ప్రభా - మంచిది; నాయనా ! వెళ్ళి రమ్ము,

బట్ల - (నిష్క్రమించును.)

ప్రభా - విచార మెందులకు. ఏప్రాణి కేక్షణమున కేస్థితి రావలయునో యవశ్యము వచ్చితీరును. అదిగాక యోగినినైన నాకీ చీనిచీనాంబరము లేల? పరమేశ్వరుఁడు నాయం దనుగ్రహము గలవాఁడగుట చేతనే యీపరిస్థితినిఁ గల్పించెను.

సీ. యోగినినైన నాయొడలికి చీనాంబ
                  రములేల? కాషాయ. మమరుఁగాని
    జటినైన నామేన సవరింప సగరు చం
                  దనమేల? భస్మచందనమేగాని