ఈ పుట ఆమోదించబడ్డది

నాయకుడు నాయికను పొందడానికి దయ్యానికి అమ్ముడుపోతాడు. చేతిరక్తంతో కంట్రాక్టు వ్రాసి ఇస్తాడు. అతని సేవకుడు తనప్రియురాలిని తనకుసమకూర్చమని ముక్కుమీద గుద్దుకొని నెత్తురు తెప్పించి దానితో కంట్రాక్టువ్రాసి యజమాని అనుకరిస్తూ అవహేళన చేస్తాడు.

తారాశశాంకనాటకంలో శాంతాచంద్రులు ప్రేమ నృత్యం చేస్తూంటే వారిని వెక్కిరిస్తున్నట్లు లంబూజంబూలు ఇద్దరూ చేతులు పట్టుకొని ఒకర చంద్రునీ, ఒకరు శాంతనూ అనుకరిస్తూ వికారంగా ప్రేమనృత్యం చేస్తూంటారు.

భావనిరూపణకు కూడా కధాసాదృశ్యము ఉపయోగపడుతుంది. ప్రేమగుడ్దిది అనే భావాన్ని నిరూపించడానికి మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీం (Mid Summer Night's Dream) లో మూడుసాదృశ్యగాధలను నిర్వహించినాడు షేక్స్ పియర్. ఈ మూడు గాధలలోని కధావస్తువు 'ప్రేమగుడ్దిది ' అనేదే ఈ రూపకం లో కూడ సాదృశ్యంద్వారా అవహేళన సాధించడం జరిగింది. ప్రధానకధను, యక్షులకధను అనుకరిస్తూ వృత్తిపనివారు అవహేళన చేస్తారు.

ప్రేమకోసము ఎంత త్యాగమైనా చేస్తారనే బావము మృచ్చకటికలో రెందుసార్లు నిరూపితమయింది. వసంతసేన తన నగకట్టునంతా చారుదత్తుని కొడుకునకు బహుకరించింది. చారుదత్తుని బార్య దూతాంబ మైత్రేయునికి తన నగకట్తునంతా దానము చేసింది. సంఘటనా పునరావృత్తికి దీనినికూడ ఉదాహరణగా తీసుకొవచ్చు.

ఒకే రూపకంలో ఒకేరకం సంఘటనలు రెండుమూడు జరిగితే దానిని సంఘటనాసాదృశ్యము లేదా సంఘటనాపునరావృత్తి అంటారు. ప్రమీలార్జునీయంలొ ఎనమండుగురు పురుషులు ఎనమండుగురు స్త్రీలతో విడివిడిగా ద్వంద్వయుద్ధాలు చేయడం; ఆ ఎనమండుగురు స్త్రీలు ఆ ఎనమండుగురుపురుషులను తాళ్ళతోకట్టి తీసుకొనిపోవడం; ఆ ఎనమండుగురు పురుషులు, ఆ ఎనమండుగురు స్త్రీలతో ఒకటేధోరణిలొ ప్రేమ వెల్లడించడం, ప్రమీలను చూడడానికి అర్జునుడు మారువేషంలో వెళ్లగా ప్రమీల అర్జునుని చూడడానికి కూడ మారువేషంలొ వెళ్ళడం సంఘటనాసాదృశ్యానికి ఉదాహరణలు.

ప్రహ్లాదలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పెట్టేబాధలుకూడ సంఘటనా సాదృశ్యానికి ఉదాహరణ.