మూడుపాత్రలు రంగస్థలంపై ఒకే సమయంలో ఉన్నప్పుడు వారిని ఒకేవరసలో ఉంచక, ముగ్గురినీ మూడుకోణ స్థానాలలో త్రిభుజాకారంలో ఉండవలె. మూడుపాత్రలే ఎక్కువసేపు రంగస్థలంమీద ఉండే నాటకాలలో ఈ త్రిభుజాకార సమీకరణ (triangular grouping) ప్రేక్షకులకు విసుగు కలుగకుండా, దర్శకుడు తన ఊహశక్తిని వినియోగించి అనేక విదాలుగా మార్చుకొంటూ పోవలె. ఉదాహరణకు కింది మార్పులు సాధ్యపడతాయి.
1. త్రిభుజాన్ని రంగస్థలంలో ఒకప్రదేశంనుంచి మరొక ప్రప్రదేశానికి మార్చడం
2. త్రిభుజంయొక్క వైశాల్యము తగ్గించటం
3. త్రిభుజం మొన ఉండేదిక్కును మార్చటం
4. త్రిభుజం ఆకారాన్ని మార్చటం.
5. త్రిభుజాన్ని తిప్పి ఉపయోగించటం
6. త్రిభుజకోనము ప్రాతిపదికగా పాత్రల ముఖాలను వైవిధ్యంతో ప్రేక్షకులు చూసేటట్లు స్థానాలు నిర్దేశించటం.
7. వివిధభంగిమలు ప్రతి పాత్రకు ఏర్పాటు చేయటంద్వారా త్రిభుజ సమీకరణ రూపాన్ని మరుగుపరచటం.
8. త్రిభుజ సమీకరణలోని ఒకపాత్ర స్థానాన్ని ఎత్తుచేయటం.
దర్శకుని పాత్రసమ్మేళన ప్రణాళిక
ప్రతి దర్శకుడు పాత్రసమ్మేళన విషయమైన తన మనోబావాలను నిర్థిష్టంగా రూపొందిచుకొని అవి బొమ్మలుగా ప్రయోగిప్రతిలో చేర్చుకోవలె. ఇట్లా చేయటంవల్ల ప్రయోగంలో క్రమపద్ధతి, సౌలభ్యము ఏర్పడి, నటీనటులకు పూర్వాభ్యాసంలొ తెలియజెప్పటానికి సాయపడుతుంది.
దర్శకుడు సమ్మేళనాలను రూపొందించేటప్పుడు నాటక ప్రయోగానికి అవసరమైన ప్రవేశనిష్క్రమణాలు మొదలైన ప్రక్రియలు దృష్టిలో ఉంచుకొని, పాత్రల స్థానాలు నిర్ణయించుకోవటంలో తన ప్రణాళిక మొదలుపెట్టవలె. తర్వాత ముఖ్యసన్నివేశాలు, పరాకాష్ఠ సన్నివేశాలు వాటికి తగిన ప్రాముఖ్యము గల సన్నివేశాల సమ్మేళనము చివరకు రూపోందించవచ్చు. సమ్మేళనాలు ఒకదానినుంచి మరొకటి; ఇటు నటీనటుల సౌలభ్యానికి, అటు ప్రేక్షకాసక్తికి అనుగుణంగా సాఫీగా ఒకదానితో ఒకటి కలిస్పోయేటట్లు ఏర్పరచవలె.