ఈ పుట ఆమోదించబడ్డది

ఎంతో ఉపయోగపడుతుంది; ఆ ప్రత్యేకవస్తువుకు, ఆ పాత్రలకు ఉన్న సంబంధము ప్రేక్షకుల మనస్సులకు హత్తుకుపోతుంది. దర్శకుడు మొదటిసారి ఆ వస్తువును రంగస్థల వ్యాపారంలో ప్రవేశపెట్టినప్పుడు, ప్రేక్షకులదృష్టి దానిపై పడేటట్లు దానిని రూపొందించుకోవలె.

కొన్నిసందర్బాలలో వస్తూపయోగము, దాని తాలూకు కార్యకలాపాలు, నటుడు అమలులో పెట్టనిదే సంభాషణలలోని అర్ధము ప్రేక్షకులకు సుస్పష్టంగా బోధపడకపోవచ్చు. ప్రయోగంలో దర్శకుడు, సంభాషణలు వినిపించని ప్రేక్షకునికికూడా నాటక కధాసంవిధానము, పాత్రలు స్వభావ ప్రకృతులు ఈ వ్యాపారంవల్ల సుస్పష్టమయ్యేటట్లు జాగ్రత్త పడవలె. ఆధునిక వాస్తవిక (modern realistic) నాటకాలలో కూడ తచయిత ఇచ్చే రంగస్థల వ్యాపార సూచనలు, రసవత్తరమైన నాటక ప్రదర్శనసౌలభ్యందృష్ట్యా చాలా పరిమితంగా ఉంటాయి. సూచించినవాటిలో కొన్ని సమాజపు పరిస్థితులవల్లగాని, ప్రదర్శనశాలలోని లోట్లవల్ల గాని ఆచరణయోగ్యము కాకపోవచ్చు, కాబట్టి, దర్శకుడు రంగస్థల వ్యాపారాన్ని ఎక్కువగా, తన ఊహాశక్తిద్వారా సృష్టించి, ప్రదర్శన రక్తి కట్టటానికి ప్రయత్నము చేయవలె. నాటకము రసవత్తరంగా నడవటానికి, వాస్తవిక వాతావరణసృష్టికి ఇవి ఎంతో దోహరము చేయగలవు. దర్శకుని, నటీనటుల సృజనాత్మక కళాశక్తికి, ఇవి గీటురాళ్లు. నాటకంలోని అంతర్గతభావాలు ఈ రంగస్థల వ్యాపారాలవల్లనే బహిర్గతాలవుతాయి.

1. దృశ్యానుకూల రంగస్థలవ్యాపారాలు

ఉదా: నాటకంలో ఆఫీసుదృశ్యమైతే టైపురైటరును ఒక పాత్రచేత ఉపయోగింపజేయడం; అట్లాగే వంటగది అయితే వంట ఏర్పాట్లు, బియ్యము ఏరటం, కూరలు తరగటం మొదలైనవి.

2.కాలసూచక రంగస్థలవ్యాపారాలు

ఉదయము - దినపత్రిక రావడం, పాలు తీసుకొనిరావడం మొదలైనవి.
వేసవి మధ్యాహ్నము - విసనకర్రతో విసరుకోవటం, ఫంకా స్విచ్చి వేయటం మొదలైనవి.
చలికాలం - దుప్పటి కప్పు;కోవటం, కొద్దిగా వణకటం మొదలైనవి.

రాత్రి - దీపము వెలిగించటం, మంచము వాల్చటం మొదలైనవి.