చకితులను చేసి, విస్యయము (surprise) కలిగించరాదు. ప్రేక్ష్యక మన: స్థితి పసిబిడ్డల ప్రకృతివంటిది. రాబోయే ఆకస్మిక-ఆశ్చర్య సంఘటనను ఏదో చిన్న చూచనద్వారా సూచించనిదే, దర్శకుడు రానీయకూడదు. ఏదో జరగబోతున్నది అనేభావము కలిగించి, ఏది జరుగుతుంది అన్నది మాత్రము ప్రేక్షక కుతూహలానికి, అనిశ్చిత ప్రతీక్షకు (suspense) దర్శకుడు వదిలివేయవచ్చు.
నాటకప్రదర్శన అంతర్గతభవము ఆధారంగా ఒకేరకంగా రూపొందించవలనన్న సూత్రాన్ని ప్రతిపాదించినంతమాత్రాన-ప్రదర్శనలో హాస్యము జోడించరాదనికాదు. అది సరియైన పాళ్ళలో సాఫీగా రూపొందవలె. నాటకంలో అంతర్గత భావాలలోని మార్పులను భావదశలు (moods) అంటారు.
నాటకంలోని పాత్రల ఉద్వేగాలు మార్పు చెందుతూనే ఉంటాయి. అవి నాటకాంతర్గత భావంలోనూ ఇతర పాత్రల భావోద్వేగాలతోనూ మేళన (harmony) చెంది ఉండడంగాని, విపర్యయము (contrast) కలిగి ఉండడంగాని జరుగుతూ ఉంటుంది. నాటకంలోని ఉద్వేగ పరిస్థితుల స్వరూపాన్ని 'వాతావరణము ' (atmosphere) అంటారు. ఈ వాతావరణము కూడా నాటక ప్రదర్శన వివిధభాగాలలో మారుతూ ఉంటుంది. నాటకం తాలూకు అంతర్గత భావంతో మేళవించడం (hormonization), విపర్యము పొందటం ఆయా సందర్భాలనుబట్టి జరుగుతుంది.
శైలి (Style)
వాస్తవికతకూ, నాటకానికీ ఉన్న సంబంధాన్నే ఆ నాటకంయొక్క శైలె (Style) అంటారు.
వాస్తవిక శిలి (Realistic Style)
దీనిని స్వభావశైలి అని అనటంకూడా కద్దు, నిత్యజీవిల్త దృక్పధంతో ఒక నాటకాన్ని చిత్రీకరిస్తే దానిని వాస్తవిక శైలి అంటారు. వాస్తవిక శైలి అన్నంతమాత్రాన అది సహజత్వానికి పూర్తిగా మక్కీకి మక్కి అనుకరణ కారాదు. అట్లాంటి అచ్చమైన అనుకరణ రంగస్థలంమీద అసాధ్యము; ఒకవేళ సాధ్యమైనా ఆకర్షణవంతంగా ఉండదు. ప్రేక్షకదృష్టికి వాస్వవికంగా కనిపించేదిగా ఉండి, ఆ భ్రాంతిని కలిగిస్తే చాలు.