భవభూతి తరవాతియుగము క్షీణయుగము. ఆ కాలంలో నాటకము రాజాస్థానాలలో ఎక్కువగా అభివృద్ధి చెందినది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధము కోల్పోయింది. పాత్రల అంతరజీవిత చిత్రణకు బదులు శిల్పానికి ఎక్కువ ప్రాముఖ్యమువచ్చినది. దృశ్యకావ్యాలనే పేరేగాని నాటకీయతకోల్పోయి శ్రవ్యకావ్య లక్షణాలనే అక్కువగా పొదువుకొనసాగినవి. నాటకము దృశ్యకావ్యమనే విషయము రచయితలు మరిచిపోయినారని చెప్పవచ్చు. అందుచేత ఆ రూపకాలు మరీ పెద్దివిగా తయారయి ప్రదర్శన సౌలభ్యము కోల్పోయినవి.
భవభూతి మాలతీమాధవము, మొరారి అనర్ఘరాఘవము. రజశేఖరుని బాల రామాయణము- ఇటివంటి రూపకాలు మంచి ఉదాహరణలు. వీటిని 'శ్రవ్యరూపకాలు ' అనవచ్చు.
ఈ రూపకాలలో వర్ణనభాగాలు, పద్యాలసంఖ్య అపరిమితంగా పెరిగిపోయినవి. అనర్ఘరాఘవంలో పద్యాల సంఖ్య 540. రచయిత దృష్టి పద్యాలబిగింపు, వర్ణనలమీద ఉండటంవల్ల నాటక గమనము దెబ్బతిన్నది. ఈ కాలంలొని నాటకాల ఇతివృత్తము కూడ ఎక్కువగా పౌరాణికమే. గుణంలో దెబ్బతిన్నా, రాశిలో మాత్రము హెచ్చు. ఈ యుగంలో 600 రూపకాలకు పైగా వెలువడినవి. వీటిలో ముఖ్యమైనవి దూతాంగదము, మహానాటకము, ఆశ్చర్య చూడామణి, కందమాల, బాలరామాయణము, బాలబారతము, కర్పూరమంజరి.
ఈ యుగంలో వచ్చిన నాటకాలలో ఎక్కువగా నాటకీయతను పొదువుకొన్న నాటకము వేనిసంహారము. దీనిని రంచించిన భట్టనారాయణుడు నన్నయకు భారతరచనలో తోడ్పడిన నారాయణ భట్టే అని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. దీని అనువారము ఆంధ్రపదేశంలో ఒకప్పుడు బహుళ ప్రచారంలో ఉండేది. ప్రయోక్త గొప్పతనానికి, నటుని గొప్పతనానికి ఈ నాటక ప్రదర్శనము ఒక ఒరపిడిరాయి. ఈ యుగంలో ఇంకో పెద్దవిశేషము వ్ వైధ్యము, కృష్ణగాధలు, చరిత్రాత్మక గాధలు, కల్పితగాధలు రూపకాలకు వస్తువులయినాయి. రుక్మిణీహరణము, ప్రద్యుమ్నాభ్యుదయము వంటి కృష్ణ నాటికలు; కౌముదీమహోత్సవము, కర్ణసుందరి, హమ్మీరమదమర్ధనము వంటి చరిత్రాత్మకాలు; కర్పూరమంజరి, విద్ధలాలభంజిక, మృగాంకలేఖ వంటి కల్పితాలు ఎక్కువగా వెలువడినాయి.