సంసృత రూపకోత్పత్తులను గురించిన వివిధ సిద్దాంతాలు రూపకోత్పత్తి ప్రకరణంలో తెలుసుకొన్నాము. ఇప్పుడు సంస్కృత రూపక చరిత్రను పరిశీలింతాము.
ప్రప్రధమంతా సంస్కృతంలో వెలువడిన రూపలక్షణ గ్రంధము భరతముని "నాట్యశాస్త్రము"(క్రీ.పూ. 200 ప్రాంతము). సాధారణంగా ముందు లక్ష్యము, దానిననుసరించి లక్షణము రావటం పద్ధతి. అయితే నాట్యశాస్త్రంలోని లక్షణాలకు లక్ష్యాలైన రూపకాల ఆచూకీ తెలియడంలేదు. కొందరు చరిత్రకారులు భాస మహాకవి నాటకాలు భరతమునికి పూర్వపు నాటకాలని అభిప్రాయపడినారు. కాని ఇందుకు కచ్చితమైన ఆధారాలు దొరకటంలేదు.
నాట్యసాస్త్రంలో రూపకవిభాగంతోపాటు సంగీత, నృత్యవిభాకాలకు ప్రాముఖ్యమివ్వడం, భరతముని "నాట్యశాస్త్రము" తరవాత వెలువడిన దశరూపకాది రూపకలక్షణగ్రంధాలలో సంగీతవృత్యవిభాగాలు లేకపోవడం గమనార్హము. అందువల్ల భరతముని కాలంనాటి తొలిసంస్కృత రూపకాలు సంగీత, నృత్య రూపకాలనీ, ఆ తరవాత క్రమేణా సంగీతనృత్యాలకు స్థానముతగ్గి, గద్యపద్యాత్మకాలుగా రూపొంచినవనీ భావించవలసి వస్తున్నది.
మనకు తెలియవస్తున్నన్నంతలో ప్రప్రధమ సంస్కృత రూపకర్త కూడా భరతమునే ! ఈయన రచించిన రూపకాలు మూడు-- అమరవిజయము, అమృతమధనము, త్రిపురదాహము. ఈ మూడూ ఇపుడు లభ్యముకావటంలేదు. రూపకప్రదర్శనానికి అనువుగా నాట్యగృహము మొట్టమొదటగా నిర్మింపజేసినది కూడ భరతమునే ! నాటినుంచి అక్కదక్కడా కొద్ధి స్వాతంత్యము వహించినా సంస్కృతరూపకకవులు నాట్యశాస్త్రంలోని రూపకలక్షణాల పరిధిలోనే రూపకాలు రచిస్తూ వచ్చినారు.