ఈ పుట ఆమోదించబడ్డది

6

సమాలోచనము

తారికలోని స్తుత్యాదికము, కాండాంతముననుండు స్తుత్యాదికము యుక్తియుక్తముగ నున్నదని చెప్పవచ్చును. గోనబుద్ధారెడ్డిపేరను, తత్పుత్త్రులపేరను రంగనాథుఁడు రామాయణము నంతను వ్రాసియే యుండినఁ "బూర్వభాగము మాత్రము ఎక్కువ వ్యాప్తిఁలోనికి వచ్చి యుత్తరభాగ మేల వ్యాప్తిలోనికి రాక నిలిచిన"దని ప్రశ్నింపవచ్చును గాని, శ్రీ మద్ద్రామాయణములోనే యుత్తరకాండము పురాణము చెప్పుటకును, బారాయణమునకును ననువుకాని దగుటయు నందు విశేషించి సీతావియోగాదిక ముండుట మనస్సున కెక్కువ యాకులత గల్గించుననుటయు, నిదర్శనములు కాఁబట్టి, లోకమున రంగనాథరామాయణము పట్టాభిషేకమువఱకుఁ గల కథాభాగము ప్రశస్తి కెక్కినది. ఉత్తరకాండభాగము పలువురు వ్రాసికొనక వదలిరి. ఆ కారణముననే ఉత్తరకాండ గల పుస్తకములు (తాళపత్రగ్రంథములు) ఆఱుకాండలు గల గ్రంథములసంఖ్య కంటె నల్పమగుటకు హేతువని యెల్లవా రంగీకరింతు రనుట నిస్సంశయము. మొత్తముమీఁద ద్విపద రామాయణము రంగనాథుఁడు రచించి తనపేర గ్రంథము వెలయుటకును, రచన గోనబుద్ధరాజు తత్పుత్త్రులు చేసినట్లు వ్రాయుటకును ఏర్పాటు చేసికొని యుండునేకాని వేఱుకాదు. లేకయున్న బుద్ధరాజు సంస్థానాధిపతిగా నుండి తత్పుత్త్రులు కొండంతవాని పుత్త్రులుగ నుండి బుద్ధరాజు రామాయణ మని వ్యాప్తి నొందింపక రంగనాథరామాయణ మని వ్యాప్తి చేయుటలోఁ దమప్రాశస్త్యమునకు లోపము కల్పించుకొందురా? తనవస్తువు నితరుని దని యుత్తమత్వముగల దాని నీనఁ గాచి నక్కలపాలు చేయున ట్లెవ్వఁడేని చేయునా? రంగనాథుఁ డన్ననో తనకుఁ బాలకులును, నన్నవస్త్రము లిచ్చి పోషించువా రగుట తనకృతిని వారు వ్రాసిరని వారిపేర వ్రాసెను. ఇది సమంజసమే. ఉప్పు పప్పు తిన్నదోష మింత చేసెను. కృతజ్ఞుని ధర్మము గదా యిది. రంగనాథుఁడే యీ రామాయణకర్త యను నాభావము నెల్లరు నామోదింతురు గాక: ఈ వ్రాఁత ప్రాభవమని యెంచరాదు. ఇది తగిన యూహ.

ఈ విషయమయి వీరేశలింగము పంతులుగారు “ఒకవేళ రంగనాథుఁడే యాఱువేల నియోగియై యుండవచ్చును. ఆఱువేల నియోగియైన కోవెల గోపరాజు రంగనాథుని నియోగి కవులలోఁ జేర్చి యీ క్రింది పద్యమునఁ జెప్పియున్నాఁడు.


అనఘు హుళక్కి భాస్కరు, మహామతిఁ బిల్లలమఱ్ఱి పెద్దిరా
జును, బినవీరరాజుఁ, గవి సోమునిఁ, దిక్కన సోమయాజిఁ, గే
తనకవి, రంగనాథు, నుచితజ్ఞుని నెఱ్ఱన, నాచిరాజు సో
మన, నమరేశ్వరుం, దలఁతు మత్కులచంద్రుల సత్కవీంద్రులన్."


అని, వ్రాసిరి. కాబట్టి రంగనాథుఁడను కవీంద్రుఁడే లేఁడనువా రీమాట కేమందురో ?

సమకాలికులును నేఁటికి వందవత్సరములు ముందుండువారును నగు మహాకవులు రంగనాథుని ఆర్వేల నియోగి బ్రాహ్మణుఁడని రంగనాథరామాయణము రచించి