ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నతికాయుతలఁ జూచి యతిభీతిఁ బొంది - హతశేషు లైనదైత్యాధముల్ పఱచి
లంకఁ జొచ్చుటయుఁ గెలంకుల కపులు - నంకించి రెంతయు నారాముతమ్ముఁ;
డరుదెంచి శ్రీరాము నడుగుల కెరఁగఁ - గరము సంతోషించి కౌఁగిటఁ జేర్చి
వినుతించు నాకపివీరులతోడ - ననయంబు హర్షించె నవనీశుఁ డంత;
నాదైత్యనాథుండు నయ్యతికాయుఁ - డాదిగాఁ గలదైత్యు లార్వురు వడుట
విని మూర్ఛపాల్పడి వేగంబె తెలిసి - ఘనముగాఁ గన్నీరు గ్రమ్మ నందంద
నతిదుఃఖమును బొంది యడలుచు నున్న - పతికడ కేతెంచి పల్కె మయుసుత!
"యసురేశ! లోకంబు లన్నిటిలోన - నసమానసత్త్వుఁడ వైన నీకిట్లు
పాడియె శోకింపఁ బంటవై నీవు - నాఁ డేల తెచ్చితి నరనాథుదేవి?4560
నొప్పింప నేరవై తుచితకాలమునఁ - దప్పె నారామునిఁ దలపడ్డ దైత్యు
లరుదెంతు రనుమాట లవియుఁ బోవిడువు - సురవైరి యాజిలోఁ జూపు నీకడిమి"
యను మాట లాలించి యాత్మఁ జింతించి - వనిత నంతఃపురవరమున కనిచె.
నినిచినవగలతో నిట్టూర్పుఁ బుచ్చి - తనమంత్రివరులతో దశకంఠుఁ డనియెఁ.
“గటకటా! తమ్ములు గాదిలిసుతులు - నిటు నేలఁ గూలి రిం కే మనఁ గలదు?
విబుధుల కైనను విడిపింపరాని - ప్రబలంబు లగు నాగపాశబంధములఁ
బాసిరి మాయపో బలిమి నో మనుజు - లాసచేసినఁ జెల్ల దది నాకు జయము;
ఆరాముతమ్ముని నాజిలో గెలుచు - వీరుని నెవ్వని వెదకియుఁ గాన
భయ మెన్నఁడును లేక పరఁగునీలంక - భయమును బొందె నాబలియులవలన
నారామవిభుని పరాక్రమంబునకు - మేర యెయ్యది? యిఁటమీఁద నీలంక4570
యతనిచేఁ జెడకుండ నరసి యేమఱక - ప్రతిదినంబును గావఁ బంపుఁడీ" యనుచు
నంతఃపురంబున కరిగి యొక్కరుఁడ - యంతరంగంబున నడలుచునుండె.
నప్పుడు చనుదెంచి యామేఘనాదుఁ - డప్పంక్తికంఠున కనియె నింపార
"నే నీకు గలుగంగ నిటు వగ పేల? - దానవాధీశ్వర! తగదు చింతింపఁ
బటుతరం బైన నాబాణసంహతికి - నెటు సహింపఁగఁ జాలు నీశ్వరుం డైన?
నటు చూడు రాముని నాతనితమ్ముఁ - జటులాంబకముల జర్జరితులఁ జేసి
యసువులు వెఱికి యయ్యగచరావళుల - వసుమతిపైఁ గూల్చి వచ్చెదఁ గడిమి
విబుధకంటక! నేఁడు వినుము నా ప్రతిన - విబుధలోకేశుండు విష్ణుండు యముఁడు
శిఖియును రుద్రుండు సితకరార్కులును - నఖిలసాధ్యులు బలియజ్ఞవాటమున
నేచి విజృంభించునెడఁ ద్రివిక్రమునిఁ - జూచినగతి నన్నుఁ జూతురు గాక!"4580

ఇంద్రజిత్తు రెండవమాఱు యుద్ధమునకు వెడలుట

యని వీడుకొని దివ్య మగు రథం బెక్కి - దనుజేంద్రతనయుఁ డెంతయు సొంపుమీఱి
నడువంగ నప్పుడు నానాముఖములఁ గడువేగమున నుర్వి గదలగాఁ గదలి