ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెందును బొడగాన కిచ్చలో వగలఁ - బొందుచు నటఁ బోయి పురసమీపమునఁ
బసిఁడికోటలచేత భాసిల్లుచున్న - యసమానమైన యుద్యానంబుఁ గాంచి
మెల్లన నటఁబోయి మెలఁగి వీక్షించి - యల్లనల్లనఁ బ్రాఁకి యాకోట లెక్కిఁ
చందనపున్నాగసహకారతరుల - మందారఖర్జూరమాతులుంగములఁ
బనసపిప్పలినింబపాటలీవకుళ - ఘనసారసౌవర్ణకర్ణికారముల
మల్లికామాలతీమాధవీలతల - సల్లకీకురవకజంబీరతరులఁ
దాలతమాలహింతాలరసాల - నాళికేరాశోకనాగవల్లరుల
నేడాకుటరఁటుల నేలాలవంగ - దాడిమనారంగతక్కోలతరులఁ160
గదళికాకేతకీక్రముకపూగములఁ - బదనైనగోస్తనీఫలగుళుచ్ఛములఁ
బరిపక్వబహుపుష్పపరిమళమిళిత - భరితమై వాయుసంపదల నిం పెక్కి
కలకంఠశుకనీలకంఠశారికలఁ - జెలువొందు నళులచేఁ జెలు వగ్గలించి
కమలాకరంబులఁ గరము శోభిల్లి - కుముదషండంబులఁ గొమరు దీపించి
శశికాంతవేదుల సన్నుతి కెక్కి - విశదచంద్రికలచే వేడ్క సొంపెక్కి
సికతాతలంబులచేఁ జెన్నుమీఱి - సకలర్తువిహరణస్థానమై మిగుల
రమణ మైనది చైత్రరథ మన మించి - యమరేంద్రునందన మనఁ జూడ నొప్పి
యలరు రావణవినోదారామభూమి - గలయంగఁ గనుఁగొని కడుచోద్య మంది
యొప్పు నావనభూమి కొయ్యన డిగ్గి - చప్పుడు కాకుండఁ జరణంబు లిడుచుఁ
గొలఁకులయందును గూలంబులందుఁ - బులినదేశములందుఁ బొదరిండ్లయందుఁ170
గేళీగృహములందుఁ గృతకాదులందు - శైలశృంగములందు సానువులందు
నుర్వీరుహములందు నోలంబులందు - నుర్వీతనూభవ నుడుగక వెదకి
ఆవనమధ్యంబునందు రేఁబగలు - కావలియుండు రాక్షసకోటి కెపుడుఁ
దావలంబై మిన్ను తలఁదన్నుపొడవు - చే వెలుంగుచు మేరుశిఖరాళిఁ గేరు
పసిఁడికంబములచేఁ బసమీఱి వేయు - పసిఁడికంబములచే పఱపు దీపించి
వరరత్నతోరణావళుల శోభిల్లి - యురుతరం బగుచున్న యొకమేడఁ గాంచి
యామేడలోపల నంతయు వెదకి - భూమిజఁ గానక బుద్ధిలో వగచి
“యినవంశవల్లభుఁ డేకతంబునను - మును నన్ను రమ్మని మదమొప్పఁ బిలిచి
జనకజ పొడగానఁజాలుదు వీవ - యని చెప్పి నాచేతి కానవా లిచ్చెఁ
బని బూఁని వచ్చితి బంటనై యేను - గనుఁగొనలేనైతిఁ గమలాక్షి నెందు180
నీదురాత్ముఁడు సీత నిటఁ దెచ్చుచోట - వేదనఁ బ్రాణము ల్విడిచెనొ యింతి
యంబరగతి భీతి నరుదెంచుచోట - నంబుధిఁ బడియెనో? యసురచేఁ దప్పి
యిచ్చటిదనుజుల నీక్షించి బెదరి - చచ్చెనో? విరహాగ్ని సమసెనో? లేక
కమలాక్షి నొరులకుఁ గానరాకుండ - భ్రమపెట్టి మాయలు పన్నెనో వీఁడు