ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పౌరులు మంత్రులు బాంధవు లప్పు - “డోరామ! యిటు సేయు టుచిత" మటంచుఁ
బలుకంగ వేవేగ భరతుండు హేమ - విలసితపాదుకాద్వితయంబు రాము
ముందఱ నిడిన సంఫుల్లారుణార - విందపల్లవగర్భవిభవభేదములు
యతివధూతిలకశాపాపనోదములు - శ్రుతిశిరోభవనవిశ్రుతవినోదములు
తనదుపాదుకలు సంతతసనకాది - మునివివాదములు రాములు మోపి యొసఁగఁ
జేకొని యవిరెండు శిరమునఁ దాల్చి - కైకేయికొడుకు రాఘవున కిట్లనియె.
నీవేషమున నేను నృపవేష ముడిగి - తావక పాదుకాద్వంద్వంబునందుఁ1720
బదిలంబుగా రాజ్యభారంబు మోపి - పదునాల్గువర్షముల్ పాలించువాఁడ
నామీఁద మీ రయోధ్యకు రాకయున్న - స్వామిపాదము లాన వహ్ని యేఁ జొత్తు."
నని పల్కి యన్నకు నతిభక్తి మ్రొక్క - ననుజుని దీవించి యక్కునఁ జేర్చి
తల్లుల నూరార్చి ధన్యు లౌ మౌని - వల్లభులను మంత్రివరుల బాంధవుల
నెల్లవారలఁ బ్రియం బెసఁగ వీడ్కొలుప - నుల్లంబులో శోక ముప్పొంగుచుండ
భరతుఁ డప్పుడు రాముపాదుకంబులకు - సరిప్రదక్షిణనమస్కారముల్ చేసి
పట్టంపుటేనుంగుపై నొప్పఁ దెచ్చి - పెట్టె లోకములెల్లఁ బ్రీతిఁ గీర్తింప,
ఛత్రచామరములు సరిదాల్చి పొలిచి - శత్రుఘ్నుఁడును దాను సద్భక్తిఁ గొలిచి
చెలఁగి నల్దిక్కుల సేనలు గొలువఁ - గులపవిత్రుఁడు చిత్రకూటంబు డిగ్గి
యిబ్భంగి భరతేశుఁ డింపార సరిగి - యబ్భరద్వాజుని యడుగుల కెఱఁగి1730
యతనితో నట్టివృత్తాంతంబు దెలిపి - యతఁ డంతఁ బనుప సైన్యంబులు దాను
నట పోయి గంగామహానది దాఁటి - యట శృంగిబేరంబునందు నాగుహుని
పటుయశోధనుని సంభావించి నిలిపి- యట పోయి మఱి యయోధ్యాపురిఁ జొచ్చి
తడయక నగరిలోఁ దల్లుల నునిచి - కడుమూలబలములఁ గాపుగాఁ బెట్టి
మణిలేని పెట్టియమాడ్కి నాకాశ - మణిలేని పగలింటిమాడ్కిఁ జూడ్కికిని
చతురపుణ్యుఁడు రామచంద్రుఁడు లేని - యతిశూన్య మగు నయోధ్యాపురిఁ జూచి
యాయతశుభశీలుఁ డందుండ రోసి - పోయి నందిగ్రామపురిని వసించి
పనివడి రఘురాముపాదుకాయుగళ - మున రాజ్యభార మిమ్ముల నావహించి
శ్రీరామునకుఁ బోలె సేవ సేయుచును - నారచీరలు జడల్ నవయుచుఁ దాల్చి
యారాఘవుని పునరాగమనంబుఁ - గోరుచు నతనిసద్గుణము లెన్నుచును1740
సరససజ్జనమంత్రిసమ్మతితోడ - భరతుండు మహియెల్లఁ బాలించుచుండె,
యిది యయోధ్యాకాండ మెల్లలోకముల - విదితమై బుధలోకవినుత మౌఁగాక!
అని యాంధ్రభాష భాషాధీశవిభుఁడు - వినుతవాక్యాగమవిమలమానసుఁడు
పాలితాచారుఁ డపారధీశరధి - భూలోకనిధి గోనబుద్ధభూవిభుఁడు
తమతండ్రి విఠ్ఠలధరణీశుపేరఁ - గమనీయగుణధైర్యకనకాద్రిపేరఁ