ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిది యేలకో కైక! యింకొకమాట - ముదిత! చెప్పెద నిక్కముగ నీవు వినుము
కలువరేకులఁ టోలు కన్నులవాని - మొలకనవ్వులమోముమురిపెంబువాని
బలువైన యాజానుబాహులవాని- నలరాజుఁ గేరు చెల్వముగలవాని
నలరు గల్వలకాంతి నగు మేనివానిఁ - జల్లచూపులు వెదఁజల్లెడువాని
సుధ లొల్కు తియ్యనిసుద్దులవాని - బుధులకు హితవాత్మఁ బూనెడువాని
వలచి నా కెపుడు సేవలు సేయువాని - నిలు వెల్ల ధర్మమై నెగడెడువాని280
రాముని జితభృగురామునిఁ గాంతి - సోముని సద్గుణస్తోముని కీర్తి
కాముని సౌందర్యకాముని శాంత - ధాముని రవిసమధామునిఁ బాసి
నిమిషమాత్రం బైన నే నోర్వఁజాలఁ - గమలాక్షి! నీ వెఱుంగవె యిట్టివాని?
నాయుత్తమోత్తము నడవుల కనుపఁ - బోయెఁ బ్రాణంబులు వోవు నాక్షణమె;
యెంతపాపిష్ఠవే యెంతకట్టడివె - యెంతమూఢాత్మవే యెంతరాక్షసివె?
కఠినాత్మురాల! యీ కల్మషంబేల? - శఠమతిఁ గోరెదు సాధ్వివై యుండి,
యాలపై ప్రాణాపహారంబు సేయు - కాళరాత్రివి గాక కాంతవా నీవు?
నడచి రాముఁడు కాననమున కె ట్లరుగు? - నడవుల నె ట్లుండు నందఱ దొఱఁగి?
మెత్తనిపాన్పున మేనెత్తుభోగి - యెత్తెఱంగున నుండు నిలఁ దృణశయ్యఁ?
బంక్తి నిష్టాన్నముల్ బంధులు దాను - నెంతయు నియతితో నిట నారగించు290
కడుపుణ్యదేహికిఁ గందమూలములు - నెడపక భుజియింప నెటు సమ్మతించు?
నతివ! నీ కతిభక్తుఁ డైనరామునకు - మతి కీడు దలఁపకు మన్నింపు" మనుచు
నడరుశోకంబున నడుగులమీఁదఁ - బడిన మ్రొ క్కొల్లక పాదముల్ దిగువ.
భూకాంతుఁ డిలఁబడి పొరలఁ గైకొనక - కైకేయి దశరథుఁ గని యిట్టులనియె.
“చాలుచా లీవట్టిజగజోలిమాట - చాలింపు మీవట్టిజాడ లేమిటికి?
ధర్మంబు మాని, సత్యము వీఁటిబుచ్చి - నిర్మలయశ మెల్ల నీటిలోఁ గలిపి,
యీవరద్వయము నా కీలేదటంచు - భూవర! బొంకి నీపుత్త్రుండు నీదు
దేవులు నీవు వర్ధిల్లుము నేను - నావరసుతుఁడు ప్రాణములఁ బాసెదము.”
అనునంత మారాడ కనువేది విభుఁడు - తనమది శోకించి తల వాంచియుండె
నంత వేఁగుటయుఁ దూర్యంబులు మ్రోయ - నంతంత వందిజనావళి పొగడఁ300
గలగొని గర్పూరగంధముల్ చల్లి - జలముల జలకంబు చదురొప్ప నాడి
పరఁగ దివ్యాంబరాభరణముల్ పూని - చిరకీర్తి రాముఁడు సీతతోఁ గూడి
తెఱఁగొప్ప శచితోడ దేవేంద్రుఁ డొప్పు - తెఱఁగున సంపూర్ణతేజుఁడై యొప్పె
మఱి యంత నభిషేకమంటపంబునకు - నెఱి వసిష్ఠాదులు నిండ నేతెంచి
యాయరుంధతి మొదలగు పుణ్యసతులు - నాయతమతు లగు నామంత్రివరులు
తగవొప్ప మకుటవర్ధనచక్రవర్తు - లగు మహారాజుల నందు రప్పించిI