పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/73

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. రీమాన్ శిష్టాభిప్రాయం

పైసా ఖర్చు లేకుండా మిలియన్ డాలర్లు సంపాదించే ఉపాయం చెబుతాను, వింటారా?

“అంత తేలికైతే మీరే ఆ ఉపాయం వాడుకో వచ్చు కదా?” అని మీరు అడగొచ్చు.

“తేలిక అన లేదు. ‘కానీ ఖర్చు లేకుండా’ అన్నాను. లాటరీ టికెట్టు కొనక్కరలేదు, వేగస్ కి వెళ్లి వేలు తగలేసుకు రానక్కరలేదు. కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చుని సంపాదించే ఉపాయం.”

“చెప్పండి, అయితే!”

“రీమాన్ ఉటంకించిన శిష్టాభిప్రాయం (conjecture) ఒప్పే” అని రుజువు చేస్తే క్లే మేథమేటికల్ ఇన్స్టిటూట్ (Clay Mathematical Institute) వారు బిళ్ల కుడుముల్లాంటి డాలర్లు – మిలియను డాలర్లు - పట్టుకొచ్చి ఒళ్లో పోస్తామని సా. శ. 2000 లో ప్రకటన చేసేరు.

“ఏమిటా శిష్టాభిప్రాయం?”

“జీటా ప్రమేయం యొక్క శూన్యస్థానాలు (zeros of the zeta function) లేదా మూలాలు (roots) అన్నీ (నిజ, రుణ రేఖ మీద కనబడే సాధారణ మూలాలని మినహాయించి) సంకీర్ణ లేదా జంట తలంలో (అనగా, complex plane లో) x = ½ అనే రేఖ మీదే గుమిగూడి ఉన్నాయి” అని ఋజువు చెయ్యాలి. ఇది నిజమే సుమా అని రీమాన్ ఒక అమూల్య అభిప్రాయం వెలిబుచ్చేరు - ఋజువు చెయ్యకుండా! మనకి ఇప్పుడు ఆ ఋజువు కావాలి. ఈ అభిప్రాయం నిజమే అని ఋజువు చేసిన వారికి మిలియను డాలర్లు బహుమానం ఇచ్చెస్తారు. అంతటితో పురస్కార పరంపర ఆగిపోదు. ఏదో పెద్ద విశ్వవిద్యాలయం వారు ఆచార్య పదవి అంటగడతారు. “నీ తెలివిని, నా అందాన్ని పుణికిపుచ్చుకుని పిల్లలు పుట్టొచ్చు కదా” అని హా(బా)లివుడ్ తార పెళ్లి ప్రతిపాదిస్తే, మిలియను డాలర్లతో పాటు స్వర్గ ద్వారాలు కూడ తెరుచుకోవచ్చు!