పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ పావంచాలన్నీ దాటుకుని కాన్వే 290 గురించి ప్రతిపాదించిన ఊహాగానానికి కూడా భార్గవ, హెన్కె కలసి ఋజువు చూపించేరు. ఇదొక పెద్ద మైలు రాయి. కనుక ఇప్పుడు మనకి వర్గు సూత్రాల యొక్క స్వరూప స్వభావాలు పరిపూర్ణంగా అవగాహన అయినట్లే – అని అనుకుంటున్నాం, ప్రస్తుతానికి. వీరు చెప్పేది ఏమిటంటే – ఏ వర్గు రూపమైనా సరే పూర్ణ సంఖ్యలన్నిటిని ఉత్పత్తి చెయ్యగలదో లేదో నిర్ణయించాలంటే ముందు ఆ రూపం 290 తోపాటు 290 కి లోపుగా ఉన్న ఒక 29 పూర్ణాంకాల సమితిని ఉత్పత్తి చెయ్యగలదో లేదో చూడాలిట. ఈ సమితి (set) లో ఉన్న 29 పూర్ణాంకాలనీ ఉత్పత్తి చెయ్యగలం అని తెలిసిన మీదట అలా ఉత్పత్తి చెయ్యగలిగే వర్గు రూపాలు 6,436 ఉన్నాయని ఋజువు చేసేరు! (బొమ్మ 7.3 చూడండి.)

బొమ్మ 7.3 "29 పూర్ణాంకాల సమితితో" అడ్డు దారి.

ఇదే విషయాన్ని భార్గవ కుంభకోణంలోని సమావేశంలో చెబితే ఆయనకి రామానుజన్ స్మారక చిహ్నమైన ‘శాస్త్ర’ పతకాన్ని ఇచ్చి గౌరవించేరుట. (ఇక్కడ ‘శాస్త్ర’ అన్నది Shanmugha Arts, Science, Technology & Research Academy కి ఆద్యక్షర సంక్షిప్తం అని గమనించ వలెను.) ఈ విశ్వవిద్యాలయం ప్రతి ఏటా, శ్రీనివాస రామానుజన్ పేర, పది వేల డాలర్ల నగదు బహుమానాన్ని 2005 నుండీ ఇవ్వటం మొదలు పెట్టింది. ఈ బహుమానం రామానుజన్ ఒరవడిలో పరిశోధన చేసి ఫలితాలు సాధించిన 32 ఏళ్లు లోపు గణిత శాస్త్రవేత్తకి ఇవ్వాలని నిర్ణయం జరిగింది.