పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/64

ఈ పుట ఆమోదించబడ్డది

క్రింద నారాయణమూర్తియొక్క పెత్తండ్రిభార్య సంతు లేక మృతి నొందినందున, ఆమె సొత్తు పదివేల రూపాయలు ఆతనికిఁజేరెను. ఆ సంగతి తెలిపినతోడనే రాజశేఖరుఁడుగారు పరమానందభరితులై నారాయణమూర్తి యింటికిఁబోయి యాతని నాలింగనము చేసికొని తనకీయవలసిన యప్పును దీర్పవలసినవని లేదనియు యావద్ధనము తోను గౌరవముతో సుఖజీవనము చేయవలసిన దనియుఁజెప్పి యాదరించిరి. రాజశేఖరుఁడుగారి కీవఱకు బదులు చేయవలసిన యావశ్యక మంతగా తటస్టింపనందునను, ధనము విశేషముగ నున్నందునను నారాయణమూర్తి కావలసినయెడల తన ధనమును వాడుకోవచ్చునని రాజశేఖరుడుగారితోఁ బలుమారు పూర్వము చెప్పుచువచ్చెను.

ఒకనాఁడు నాలుగు గడియల ప్రొద్దెక్కిన తరువాత రాజశేఖరుడుగారు కచేరి చావడిలోఁ బలువురతోఁ గూరుచుండి యున్న సమయమున రుక్మిణి నూతివద్దకు వచ్చి యక్కడనుండి పెరటి గుమ్మముదగ్గఱకుబోయి లోపలనే నిలుచుండి, తరిగిన గుమ్మడికాయ పెచ్చులను వీధిలోఁ బాఱవేయ వచ్చిన పొరిగింటివారి యాఁడు పడుచుతో మాటాడుచుండెను. అప్పడు చేతితో తాటాకు గిలక గుత్తుల నాడించుచు నెత్తిమీద నొక బుట్ట పెట్టుకొని యొక్క యొఱుకత యామార్గమునఁ బోవుచు రుక్మిణి మొగమువంక నిదానించి చూచి నిలువబడి "అమ్మా! నీకు శీఘ్రముగానే మేలు కలుగుచున్నది; భాగ్యము కలుగుచున్నది. నీ మనసులో నొకవిచారము పెట్టుకొని కృశించుచున్నావు. ఎఱుక యడిగితే నీమనసులోనున్నది సూటిగా జెప్పెద" నని చెప్పెను. ఆ మాటలు విని యా ప్రబోధికను దొడ్డి లోనికిఁ బిలుచుకొనిపోయి కొట్ల చాటునఁ గూరుచుండబెట్టి తాను లోప లికిఁబోయి చేటలో బియ్యము పోసి తెచ్చి యా బియ్యమును దనచేతిలో నుంచుకొని ముమ్మాఱు తనచేయి పాలమున మోపి మొక్కి కార్య మును తలచుకొని రుక్మిణి తన చేతిలోని బియ్యమును చేటలో విడిచి పెట్టెను. అప్పడాయెఱుకత తాను వల్లించిన రీతిగా నిష్టదైవతములఁ దలఁచుకొని వాకీయుఁడని వేడుకొని యామెచేయి పట్టుకొని