పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/181

ఈ పుట ఆమోదించబడ్డది

పదమూడవ ప్రకరణము


శంకరయ్య కాసుల పేరుతో వచ్చుట__ఆతఁడు తన తండ్రి వృత్తాం తమును వినిపించుట__వైష్ణవ గురువుల యూరేగింపు__నృసింహ స్వామియొక్క రాక__ఆతఁడు తన కథను జెప్పుట.

పైని చెప్పిన రీతిగా రుక్మిణియు తల్లిదండ్రులను మాటాడు కొనుచుండగానే పదునాఱు సంవత్సరముల యీడుగల యొక చిన్న వాఁడు వచ్చి బుజముమీఁది మూటను క్రిందఁ బడవైచి రాజశేఖరుఁడు గారి కాళ్ళమీఁదఁబడి 'అయ్యో మామయ్యా' యని యేడువ నారంభించెను.

రాజ__ఏమి శంకరయ్యా ఆఁడుదానివలె నాలాగున నేడ్చు చున్నావు? ఊరుకో.

శంక__మా నాయన పదియేను దినముల క్రిందట కాలము చేసినాఁడు. నేనప్పుడు గ్రామములో కూడ లేకపోయినాను.

రాజ__ఏమి రోగముచేత పోయినాఁడు? నీ వప్పుడు గ్రామములో లేక యెక్కడకు వెళ్ళినావు?

శంక__ఆతఁ డాత్మరోగముచేత పోలేదు; ఇల్లుకాలి పోయి నాఁడు. నేనా వఱకు పది దినముల క్రిందటనే నా సవతి తల్లిని తీసికొని యేలూరు వెళ్ళియుంటిని. నేనక్కడ నుండఁగా నాకీ వర్తమానము తెలిపినది.

రాజ__ఇల్లెందుచేత కాలిపోయెనో యాతడేల బయటకు రాకుండెనో నా కాసంగతి వివరముగాఁ జెప్పు.

శంక__మీరు గ్రామములో నుండఁగానే మా నాయన భూత వైద్యమునందు ప్రబలుఁడుగా నున్నాఁడు గదా? అటు తరువాత చుట్టప్రక్కల గ్రామములయందుఁగూడ అతని ప్రసిద్ధి వ్యాపించినది.