పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/153

ఈ పుట ఆమోదించబడ్డది

 భటు__నీ భుజముమీఁది మూట యెవరిది?

సుబ్ర__నాదే. మఱియొకరి మూట నా యొద్ద కెందుకు వచ్చును?

భటు__నీది కాదు. నీ వనుమానపు మనుష్యుఁడవుగాఁ గనఁ బడుచున్నావు. నిన్ను నే నిప్పుడు వదలిపెట్టను. తిన్నగా ఠాణాకు నడువు.

సుబ్ర__నేను దొంగను కాను, చిన్నప్పటినుండియు నింత ప్రతిష్టతో బ్రతికినవాఁడను. నన్ను విడిచిపెట్టు

భటు__చీకటిపడ్డ తరువాత గ్రామమునకు వచ్చిన వారిని విడిచిపెట్టఁగూడదని మా రాజుగారి యాజ్ఞ. విడిచిపెట్టెడు పక్షమున నా కేమిచ్చెదవు?

సుబ్ర__నాలుగణా లిచ్చెదను, నన్ను విడిచిపెట్టు.

భటు__నాలుగు రూపాయలకు తక్కువ వల్లవడదు. నీవు చూడఁబోయిన దొంగవుగాఁ గనఁబడుచున్నావు. మూటనక్కడ పెట్టు. పెట్టకపోయిన నిన్నేమి చేసెదనో చూడు.

ఆవరకు బాహ్యభూమికి వెళ్ళి తిరిగివచ్చుచున్న యొక పురుషుడింతలో నామార్గముననే యింటికి బోవుచుఆ సందడి విని యచట నిలుచుండి "ఏమా మనుష్యుని నట్లు తొందరపెట్టు చున్నారు?" అని యడిగెను.

సుబ్ర__చూచినారా, యీ మనుష్యుఁడు నాలుగు రూపాయ లిచ్చినఁ గాని నన్ను పోనియ్యనని నిర్బంధ పెట్టుచున్నాడు.

పురు__సుబ్రహ్మణ్యమా? నీవా కంఠస్వరమునుబట్టి యాన వాలు పట్టినాను. ఇక్కడి కొక్కఁడవును రాత్రివేళ నెందుకు వచ్చి నావు? ఇంటికడనుండి చెప్పకుండ పాఱిపోయి రాలేదు గదా? ఇంటికి రా పోదము!

సుబ్ర__ఉమాపతిగారా? మీ రిక్కడ నున్నారేమి? మీరిం కొక నిమిషము రాకపోయిన యెడల, వాఁడు బెదరించి నాయొద్ద నేమైన గాఁజేయునుజుండీ.