ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

రాజస్థానకథావళి.


నిలువరింప నేరరైరి. అప్పుడు పృథివిరాజు సింగపుంగొదమవోలే మాళవరాజున్న గుడారములోనికి దుమికియామహారాజుం జెరబట్ట వాని సైనికులు రిచ్చవడి చూచుచుండ వానిం గొనిపోయెను. అంతఁ గొంత వడికి మాళవ సైనికులు ఱిచ్చవాటునుండి మేలు కాంచి యాయుధముల సంగ్రహించి తమరాజును విడిపించుటకు పృధివి రాజు వెన్నంటి తఱుమఁ జొచ్చిరి. ఆ సైనికులు తనకుఁ గూతవేటు దూరంబునకు వచ్చినప్పుడు పృథివిరాజు వారిని వారించి సవిూపమునకు రావల దనియు సాహసించి రాజును విడిపించుటకు వచ్చి రేని రాజు నప్పుడ పొడిచి చంపెదననియు రాక నిలిచినపక్షమున రాజున కేయపాయమును సేయ ననియు మాళవ రాజును తనజనకుని పాదములపయిం బడవైచి మఱల వానిని విడిచిపుత్తుననియు వారికి సందేశ మంపెను. ఆమాటలు విని మాళవ సైనికులు వెనుకకుం జనిరి.

పృథివిరాజు మాళవేంద్రుని దీసికొని చిత్తూరునకుఁ బోవునప్పటికి రాయమల్లుఁడు కొలువుఁ దీర్చి యుండె. వీరరసావతారుఁ డగు కొడుకును బిక్క మొగముతో నున్నమాళవపతినిఁ జూచి రాయమల్లుఁడు మాళవపతి నదివర కెన్నఁడు జూచియుండమి నతఁ డెవ్వ రని కొడుకుం దఱచితఱచి యడిగెను. కొడుకు తండ్రితో "నీతఁ డెవ్వఁడో నేను చెప్పను. తొల్లి మిక్కిలి చనువుతో మీతో మాటలాడిన యా సేవకునిం బిలపింపుఁడు, అతఁడే చెప్పగలఁ" డని పలికెను. రాణా యా సేవకునిం బిలిపించి యతఁ డెవ్వఁ డని యడుగ నాతఁచు మహేంద్ర వైభవుఁ డగు తన యేలిక యంత నీచదశలో నుండుట గనుంగోని ఱిచ్చవడి నోట మాటరాక యెట్టకేల కతఁడు మాళవేంద్రుఁ డని రాణాతో విన్నవించెను. రాణాయును వాని సొమాన్యునట్లాదరింపక రాజునకు దగు గౌరవముతో నాదరించి చిత్తూరులోఁ గొన్ని దినము లుంచి వాని వద్దనుండి కప్పము గ్రహించి లోబఱచుకొని సబహు మానముగ విడిచిపుచ్చె. పృథివిరాజు తండ్రికి తన ప్రతాపముఁ జూప