ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాణాహమీరు.

33


కుల పాలుసేయ దని యతఁడు నమ్మెను. అది చిత్తూరు ముట్టడిలో యెట్లో యదృశ్య మయ్యేననియుఁ బద్మినివలెనే నదియు శాశ్వతముగా నశించె ననియు జనులు చెప్పుకొనిరి. అయినను తనయం దనుగ్ర హించి తనకు మరల రాజ్యమునొసంగిన దేవత లాఖడ్గము మరల నియ్యకపోరని నమ్మి సకల దేవతలను ముఖ్యముగా నగరసమీపమున వ్యాఘ్రగిరి మీఁద వెలసిన చారుణీ దేవిని నతఁడు మిక్కిలి ప్రాధి౯ంచెను. అంతట చారుణీ దేవి వానికిఁ బ్రత్యక్షమై యాఖడ్గ మంతఃపురమున కడుగున నున్న నేలకొట్లలో నున్నది. తీసుకోమ్మని చెప్పెను.

చిత్తూరు రాజపత్నులు రాజపుత్రికలు చిచ్చురికి చచ్చిన నాఁడు మొద లింతవఱకు మనుష్య మాత్రుఁ డెవ్వఁడు సాహసించి యాసొరంగములఁ బ్రవేశింప లేదు, చచ్చినవారి యాత్మ లచ్చట గ్రుమ్మరు ననియు ద్వారమున నొకమహాసర్పము బుసకొట్టుచు నిలిచి యెవ్వని దరిఁ జేరనీయ దనియు ప్రజలు భయంకరములగు కథలం జెప్పుకొనుచు వచ్చిరి; కాని నూనూఁగుమీసము లైన రాకమునుపే హమీరు మహా సాహసములు చేసిన శూరుఁ డగుటచే నీమాటలకు వెరువక దయ్యము లుండనీ దేవతలుండనీ పాములుండనీ యేముండనీ లోపలకుఁబోయి ఖడ్గమును దెచ్చుకొనుట కతఁడు నిశ్చయించెను.

అట్లు కృతనిశ్చయుఁడై యాశూరశిఖామణి సూర్యరశ్మి యెన్నఁ డెఱుఁగని యామహాంధ కార గుహలలోఁ బ్రవేశించి మెరక పల్లము లెఱుఁగక చేతితో గోడలఁదడుముకొనుచు తనమీఁద మందలు మందలుగా వ్రాలుచున్నవి గబ్బిలములో దయ్యములో యెఱుఁగ జాలక తాను తొక్కి పోవుచున్నవి తన తల్లి యెముకలో తక్కిన రాజాంగనలయెముకలో యని తలంచుకొని జాలి నొందుచు పోయి పోయి తుదకు విశాలమగు నొక మహాభాగముఁ బ్రవేశించి యచ్చట నొక వెల్తురు జిమ్ము మంటయు పొగయు జూచి దాని సమీపించెను