ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢిల్లీకిని, మీవారునకును సంధి.

——:(0);——

ఒకసారి కార్యనిర్వాహము సేయవలెనని పూనుకొనెనా రాణా యుమ్రా చేయవలసినంతపని చేసి యాతండ్రికిం దగినకొడుకే యని ప్రఖ్యాతిఁ బడయ జాలునుగదా ! అతఁడు ఢిల్లీ చక్రవర్తి సైన్యములతో నొకసారిగాదు, రెండుసారులుగాదు పదునేడు సారులు పోరాడెను. పోరాడినపుడెల్లఁ దానె జయమునందుచు వచ్చెను. చక్రవతి౯యగు జహాంగీరు, ఉమ్రామీఁదికిఁదనమూడవ కొడుకగు పార్వీజును బంపెను. కాని యతఁడు ప్రతిపర్యాయము పరాజయమును నొందుటచే వానిని తిరిగి ఢిల్లీకిఁ బిలిపించెను.

ఎన్నిసారు లోడిపోయినను ఢిల్లీ చక్రవతి౯ సైన్యము లిసుక పాతరలవలె తఱుగక మరల రాణామీఁదికి వచ్చుచుండెను. రాజపుత్ర సేన లన్ననో యుదయసింగు పరిపాలన మొదలు నిమిషమయినను నూపిరి పుచ్చుటకుఁ దెఱపి లేక యెల్ల కాలము కలహమే కార్యముగాఁ గ్రమక్రమముగ క్షీణించుచుండెను. అందుచేత యుద్ధము సరిగా జరుగుటకు వీలు లేదయ్యె. ఏలయన నోడిపోయిన సేన యోడిపోవు చుండఁగాఁ జక్రవర్తి పక్షమున వచ్చెడు క్రోత్త సేన వచ్చుచుండెను. రాజపుత్రుల పస కడముట్టెను. 1613 వ సంవత్సరమున జహంగీరు చక్రవతి౯ మహా సేనాసమేతుఁ డయి మీవారు పై బోవఁదలఁచి యజమీరు వద్ద విడిసి ముందు మార్గము సరిగా నుంచుటకుఁ దన రెండవ కుమారుఁ డగు షాజహానును బంపెను. అదివిని యుమ్రా మీవారు నకు వినాశ కాలము సమీపించినదని నిశ్చయించుకొనెను. చక్రవర్తి నెదిరించుటకు రమ్మని రాజపుత్రులను బిలువనంప ననేకు లదివఱకే స్వదేశరక్షణము నిమిత్తము ప్రాణములు గోల్పోవుటచే హతశేషులగు వీరులు కొలఁదిమంది మాత్రమే రాణా యొద్దకు వచ్చిరి.