ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షోడశరాజకుమార చరిత్ర

173


నుండియుఁ గడుపునిండఁ గూడు, కంటినిండ నిదురయు లేక కష్టపడుచు నడవులఁ జరియించుటచే రాజ్యప్రాప్తి యయిన పిదప నింటి పట్టుననుండి సుఖపడదలఁచి భోగపరాయణుఁడై వీరకర్మముల మరచెను. అదియునుగాక నిరంతరము రణ కేళిఁ బురికోల్పు తండ్రి లేకపోవుటచేఁ జక్రవతి౯ యంత వానితోఁ దనవంటియల్పుఁడు వైరముఁ గొనుట యనుచిత మని యుమ్రా కయ్యమును మానుకొనెను.

ప్రతాపుని మరణానంతరముఁ ఉమ్రా మున్పు తండ్రి నిర్మించుకొన్న కుటీరము తీసి వైచి స్ఫటికపు రాళ్ళతో నొక దివ్యమందిరము గట్టించి యందు హంసతూలికాతల్పంబులు బొరలుచు వేశ్యాంగనల యాటపాటలం జొక్కుచు నిలువుటద్దంబులలోఁ దనముద్దియల చెలువంబులు గనుంగొని మురియుచు విషయాసక్తుఁడయి లోకంబు మరచి కొంత కాలంబు పుచ్చె. అటులుండ నట ఢిల్లీ పురమున 1605 వ సంవత్సరమున నక్బరు చక్రవతి౯ మృతినొందెను. అనంతరము వాని కొడుకులలో హత శేషుఁ డగు సలీము జహంగీరను బిరుదుతో సింహాసన మెక్కెను. జహంగీరన జగమంతయుఁ గెల్చిన వాఁడని యర్థము. అతఁ డక్బరునకు రాజపుత్ర స్త్రీ వలన కలిగిన కొడుకగుటచే హిందువుల యెడఁ గొంతయభిమానము గలదు; కానియతఁడు వట్టి త్రాగుబోతు. హిందువులమీఁద నెంతయభిమానమున్నను తనయధికారము నిరాకరించు రాజపుత్రుల బంటుదనము సహింపనివాఁడగుటచే జహంగీరు తండ్రి పోయిన కొన్ని నాళ్ళకే యొక సేనఁగూర్చి యుమ్రామీఁదికి బంపెను.

మొగలాయి నేనలను జూచినతోడనే రాజపుత్రులకుఁ గోపాగ్ని మరలఁ గొంచెము ప్రజ్వరిల్లెను. ఆ మహావీరులందఱు కొత్తగానభ్యాసము చేసికొన్న భోగములను విడిచి పెట్టి వీరరసశోభితులయి పగతుర జంపుటయో తాము దెగటారుటయో కావలయునని నిశ్చయించుకొని గుఱ్ఱముల నెక్కి మహారాణా యగు నుమ్రా కడకుఁ జని తమకు సేనాధి