ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

రాజస్థానకధావళి.


సింగు కుమారుని మహాసాహసమునుఁ జూచి సహింపలేక యాయీడు బాలునియందంత వైపరీత్యము గనఁబడుట దేశమున కరిష్ట మని భావించి తక్షణమే యా బాలుని వధియింపుఁ డని తలారుల కప్పగించెను. తలవరు లాకుఱ్ఱని వధియిచుటకుఁ గొనిపోవుచుండ మార్గ మధ్యమున చందావతుకులస్థుఁ డగు రాజపుత్రుం డగపడి యావద్వ్రత్తాంతము వినీ తెలివి యుట్టిపడుచున్న యాబాలుని మొగముఁ జూచి విడువలేక కనికరము పెంపున వానిం జంపనీయక వెంటఁ బెట్టుకొని రాణావద్దకు వచ్చి బాలుని బ్రతికింపు మని ప్రార్థించి "నాకు సంతా నము లేదు. నేను వీనిం బెంచుకొనియెద. వీడు నాకులదీపకుఁడై యుండుఁగాక !" యని పలుక దగ్గర చుట్టమును మిక్కిలి ప్రబలుఁడు నగు చందావతువంశస్థునిమాట 'కెదురాడ లేక యుదయసింగు తల యూచి యూరకొనియె. చందావతుఁడును బాలుని తన రాజధాని యగు సాలుంమ్రానగరమునకు గొంపోయి నేల నడవనీయక కడు గారాబమునం బెనుచుచుండె.

చిత్తూరు విడిచివచ్చిన నాలుగు సంవత్సరముల కుదయసింగు శరీరస్థితి చెడినందునఁ దన మరణ మాసన్న మగుచున్న దని యెఱిఁగి లోకాంతరప్రయాణమునకు వలయు ప్రయత్నము చేయసాగెను; అది వసంతకాల మగుటచే మీవారు సంస్థానమునఁ గల సామంత రాజు లందఱు రాణాతోఁ గలిసి యడవిపంది వేఁటకుఁ బోవునట్టి సమయము. ఈ వేఁటకుఁ బోవునప్పుడు రాణా సామంత ప్రభువుల కాకుపచ్చని బట్టలు కొన్ని బహుమానముగ నిచ్చి వారిని వెంటఁ బెట్టుకొని వేఁట సలుపు వాడుక గలదు. ఆవాడుకంబట్టి ప్రభువులందఱు నుదయ సింగు మంచము చుట్టుఁ జేరిరి. ఉదయసింగు చావక మునుపు నోటమాట యున్నపుడె తనయనంతరమున జగ్మల్ రాణా కావలయునని చెప్పెను. అతనిమనసులో నేమున్నదో కాని యపుడైన జ్యేష్ఠపుత్రుఁడగు ప్రతాపునిమాట యెత్తనే లేదు. అనంతరము కొన్ని నాళ్ళ కుదయసింగు