ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాధికాసాంత్వనము 27

గీ. ఇందుబింబాస్య నవ్వుల కెంచి చూడఁ
జంద్రకిరణవిలాసంబు సహజ మయ్యె
నింతి నునుగప్పు కొప్పున కెంచి చూడ
జంద్రకి[1] రణవిలాసంబు సహజ మయ్యె. 97

సీ. శృంగారయౌవనక్షీరాబ్ధినడుమను
దనరారు బంగారుతమ్మి యనఁగఁ
దళుకుమించును మించు తనుచంద్రరేఖలో
బరిఢవిల్లు కురంగపద మనంగఁ
గలదు లే దను నట్టి కౌనుదీవియయందుఁ
బూచిన గెంటెనపు వ్వనంగ
నలువొందు నాభిపున్నాగంబునను బుట్టి
ప్రవహించు జిగితేనెవాక యనఁగఁ
గీ. జొక్కి మరు లెక్కి మెత్తలఁ జుట్టి చూడ[2]
నజుఁ డొనర్చిన మోహనయంత్ర మనఁగ
మరులు గొల్పెడు దొరసాని మరునియిల్లు
కళలు కరఁగంగ ముద్దాడి కలయు టెపుడు. 98

సీ. పంచబాణునిచేతఁ బ్రాణము ల్పోనీక
పరగెడు యమృతంపుబావి యనఁగ
మారుని ఘోరజ్వరారుచు ల్దీర్పంగఁ
బరిఢవిల్లెడు తేనెవాక యనఁగ

  1. చంద్రకి = నెమలి (సూ. రా. ని.)
  2. నేతల చుట్టియాడ - తా. ప. ప్ర