ఈ పుట ఆమోదించబడ్డది

లేదు. కాని చాటుశబ్దమునకుఁ బ్రియోక్తియను నర్ధముండుట చేతనో, ప్రబంధప్రక్రియ కంగభూతములగు అష్టాదశవర్ణన లిందు పరిహరింపఁబడుటచేతనో, అపగతసర్గ ముపకావ్య మను నాలంకారిక వచనముండుటచేతనో రసికప్రియము, రసప్రధానము, నేకాశ్వాసము నగు నీప్రబంధము చాటుప్రబంధమైనది. కవి దృష్టిలో, అంతకుముందు నాఁటి విజయరాఘవ నాయకాదులును దమ యక్షగాన నాటకములను జాటుకావ్యము లని పేర్కొనుటయు నట్టి దృష్టితోనే యనుకొందును. వెనుకటికి శ్రీ వేటూరి ప్రభాకరులు దీని నేకాశ్వాస క్షుద్రప్రబంధ మనిరి. కాని యందు నిరసన లేదనుకొందును. కావ్యాలంకారసంగ్రహకర్త చాటుప్రబంధముల నుదాహరించినచోట క్షుద్రప్రబంధము లను బర్యాయముగా వాడెను. క్షుద్రశబ్ద మిట నల్పార్థ మునఁ బ్రయుక్తము. శృంగారము నరిగించుకోలేని వారి కెవరికో యన్యార్థమున నిది క్షుద్రప్రబంధ మనిపింపవచ్చును. కాని దీనిని జాటుప్రబంధమనుటయే సమంజసము.

ఇందు సుప్రసిద్ధము సువిశాలము నైన రాధాకృష్ణుల ప్రణయైతిహాసమున నేకదేశమగు ఘట్టమును గ్రహించినాఁడు కవి- రాధ పరకీయగాఁ జెప్పఁ బడక పోయినను అత్తవావి పేర్కొనఁబడినది. సత్యభామయే ప్రతినాయిక యైనను నామె పాత్ర రూపుకట్టలేదు. ఆమె ప్రత్యేకతయు రాధికనే యాశ్రయించినది. ఆ సందర్భమునఁ దిమ్మనగారి పోకడలు బోలె డనుకరింపబడినవి.